ప్రతి రోజు మనం చేసే కొన్ని సాధారణ అలవాట్లు మన కిడ్నీల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కిడ్నీలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అవి రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం చేసే కొన్ని తప్పుల వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎక్కువ మాంసం తినడం:
ప్రతి రోజూ ఎక్కువ మాంసం తినడం వల్ల శరీరంలో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని ప్రభావం నేరుగా కిడ్నీలపై పడుతుంది. రెడ్ మీట్ లేదా ఇతర మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. దీని ఫలితంగా కిడ్నీల సామర్థ్యం తగ్గిపోయి వాటి పనితీరు క్రమంగా మందగించవచ్చు.
2. అధిక ఉప్పు తీసుకోవడం:
రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి, ఇది రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. అధిక రక్తపోటు కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్‌లలో ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం మరింత ప్రమాదకరం.
3. ఎక్కువ చక్కెర తినడం:
చక్కెరను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఈ రెండు సమస్యలు కలిసి కిడ్నీల పనితీరును దెబ్బతీయగలవు. మధుమేహం ఉన్నవారికి కిడ్నీ సమస్యలు మరింత త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.
4. తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం:
తాత్కాలిక ఉపశమనం కోసం తరచూ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడటం కిడ్నీలకు నెమ్మదిగా హాని చేస్తుంది. ఇలా అజాగ్రత్తగా వాడితే మూత్రపిండాల పనితీరు తీవ్రంగా ప్రభావితం కావచ్చు.
5. ధూమపానం:
ధూమపానం శరీరానికి అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వాటిలో కిడ్నీ ఆరోగ్యంపై పడే ప్రభావం చాలా ముఖ్యమైనది. సిగరెట్ తాగడం వల్ల కిడ్నీలకు రక్తప్రవాహం తగ్గిపోతుంది, దీనివల్ల అవి బలహీనపడతాయి.
6. తగినంత నీరు తీసుకోకపోవడం:
నీటిని సరిపడా తీసుకోకపోవడం వల్ల మూత్రపిండాలకు తగినంత సహాయం అందదు. శరీరంలో తగినంత నీరు లేకపోతే వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లవు. దీనితో విష పదార్థాలు నిల్వ ఉండి కిడ్నీలు మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.
7. సరైన నిద్ర లేకపోవడం:
సరైన నిద్ర లేకపోతే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు బలహీనపడుతుంది. ఇందులో కిడ్నీలు కూడా ఉంటాయి. నిద్ర తగ్గితే హార్మోన్ల సమతుల్యత తప్పుతుంది, దీని ప్రభావం కిడ్నీల పనితీరుపై పడుతుంది.
8. కుటుంబ చరిత్ర:
మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జన్యుపరమైన అంశం. అందుకే కుటుంబ చరిత్ర ఉన్నవారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
9. ఆలస్యంగా మూత్ర విసర్జన చేయడం:
మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోవడం కూడా కిడ్నీలకు హానికరం. ఇది మూత్రాశయంపై ఒత్తిడి పెంచడమే కాకుండా, బ్యాక్టీరియా వృద్ధికి కూడా కారణమవుతుంది, ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన ఆహారం మరియు జీవన విధానం సరైన మార్గంలో ఉండాలి. ఈ అలవాట్లను మానుకోవడం ద్వారా మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

