బ్రిటన్ ప్రభుత్వం వీసా, వలస చట్టాల్లో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. యూకేలో వలస కార్మికుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.
భారతీయులపై ప్రభావం
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, యూకేలో పనిచేయాలని, శాశ్వత నివాస హోదా పొందాలని కలలు కనే వలసదారులు, ముఖ్యంగా భారతీయులపై గణనీయమైన ప్రభావం పడనుంది. ఈ మార్పులకు సంబంధించి ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుంది.
తగ్గిన వర్క్ వీసాలు, భారతీయుల ప్రాధాన్యం
2024లో యూకే ప్రభుత్వం విదేశీయులకు 2,10,098 వర్క్ వీసాలు మంజూరు చేసింది. ఇది 2023తో పోలిస్తే 37 శాతం తక్కువ. ఈ వీసాలు పొందిన వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో జూన్‌తో ముగిసిన 12 నెలల కాలంలో 1,16,000 మంది భారతీయులు పని కోసం యూకే వెళ్లారు.
మార్పులకు కారణాలు
ప్రజల ఆందోళన, వలసలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాలు, రిఫార్మ్ యూకేకు పెరుగుతున్న ప్రజాదరణ వంటి అంశాలు వీసా, వలస చట్టాల్లో మార్పులపై దృష్టి సారించేలా చేశాయి. కొత్త నిబంధనలతో ఇమిగ్రేషన్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని ప్రధాని తెలిపారు.
ప్రతిపాదిత మార్పులు
స్కిల్డ్ వర్కర్ వీసా: దరఖాస్తుదారులు తప్పనిసరిగా యూనివర్సిటీ డిగ్రీ కలిగి ఉండాలి.
ఆంగ్ల భాషా నిబంధనలు: వీసా హోల్డర్‌పై ఆధారపడిన వారు ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కలిగి ఉండాలి.
పర్మనెంట్ రెసిడెన్సీ: శాశ్వత నివాస హోదా పొందాలంటే యూకేలో కనీసం 10 సంవత్సరాలు నివసించాలి (ప్రస్తుతం 5 సంవత్సరాలు).

