ఈ లిస్ట్‌లో మీ పాస్‌వర్డ్ ఉందేమో చూడండి!

naveen
By -

 మీ అకౌంట్ సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూశాక, మీ పాస్‌వర్డ్ వెంటనే మార్చేస్తారు!



ఈ సంవత్సరం ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్‌ల జాబితా లీక్ అయింది. సైబర్ భద్రత గురించి ఎన్ని హెచ్చరికలు వస్తున్నా, 2025లో కూడా లక్షలాది మంది వినియోగదారులు అత్యంత బలహీనమైన పాస్‌వర్డ్‌లనే ఉపయోగించినట్లు 'కంపారిటెక్' అనే సంస్థ నివేదికలో వెల్లడించింది.


"123456" మళ్లీ టాప్!

200 కోట్లకు పైగా లీకైన పాస్‌వర్డ్‌లను విశ్లేషించిన ఈ నివేదిక, దిగ్భ్రాంతికరమైన నిజాలను బయటపెట్టింది. అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌గా మరోసారి “123456” నిలిచింది. ఈ ఒక్క పాస్‌వర్డ్‌నే దాదాపు 7.6 మిలియన్ల మందికి పైగా ఉపయోగించినట్లు నివేదిక పేర్కొంది.

టాప్ 3 పాస్‌వర్డ్‌లు “123456,” “12345678,”, “123456789” కాగా, “అడ్మిన్,” “పాస్‌వర్డ్” వంటివి కూడా టాప్ 10లో ఉన్నాయి.


'India@123'.. భారతీయుల అలవాటు!

నివేదిక ప్రకారం, 'India@123' అనే పాస్‌వర్డ్ టాప్ 100లో 53వ స్థానంలో ఉంది. ఇది మన భారతీయులు ఎక్కువగా వాడే పాస్‌వర్డ్‌లలో ఒకటి.

ఆశ్చర్యకరంగా, టాప్ 1,000 పాస్‌వర్డ్‌లలో 25% కేవలం సంఖ్యలనే కలిగి ఉన్నాయి. 38.6% పాస్‌వర్డ్‌లలో "123" అనే పదం కనిపించింది. అలాగే, "Minecraft" అనే పదాన్ని 90,000 సార్లు ఉపయోగించారు.


12 అక్షరాల నియమం ఏమైంది?

నిపుణులు కనీసం 12 అక్షరాల పొడవైన పాస్‌వర్డ్‌ను ఉంచుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. పాస్‌వర్డ్ పొడవు పెరిగే కొద్దీ, దాన్ని హ్యాక్ చేయడం కష్టమవుతుంది.

కానీ, లీకైన పాస్‌వర్డ్‌లలో 65.8% పాస్‌వర్డ్‌లు 12 అక్షరాల కంటే తక్కువ పొడవు ఉండటం ఆందోళన కలిగించే విషయం.


సురక్షితమైన పాస్‌వర్డ్ అంటే ఏంటి?

సురక్షితమైన పాస్‌వర్డ్‌ క్రియేట్ చేసుకోవాలంటే, అప్పర్‌కేస్ (ABC), లోయర్‌కేస్ (abc) అక్షరాలు, నంబర్లు (123), సింబల్స్ (@#$) అన్నీ కలిపి ఉండాలి.

మీ ఫోన్‌ నంబర్లు, పుట్టిన తేదీలు, మీ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లను పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. డిక్షనరీలో ఉండే పదాలను వాడొద్దు, ఎందుకంటే హ్యాకర్లు వీటిని సులభంగా క్రాక్ చేస్తారు.


ఈ లిస్ట్‌లో ఉన్న పాస్‌వర్డ్‌లను మీరు కూడా ఉపయోగించినట్లయితే, వెంటనే వాటిని మార్చండి. సైబర్ దాడులు, డేటా బ్రీచ్‌ల నుంచి తప్పించుకోవాలంటే బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవడం ఒక్కటే మార్గం.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!