US vs Iran Real Reason: అణ్వాయుధాలు కాదు.. అమెరికా అసలు టార్గెట్ చైనా కున్లున్ బ్యాంక్.. ఎందుకో తెలుసా?

naveen
By -

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం అణ్వాయుధాలు, రాజకీయాల కోసమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే.. మన జేబుల్లోని డబ్బు వాల్యూను డిసైడ్ చేసే ఒక అతిపెద్ద ఆర్థిక యుద్ధం నడుస్తోంది. ఇరాన్ ఆయిల్, చైనా బ్యాంక్, అమెరికా డాలర్.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న భయంకరమైన బార్టర్ సిస్టమ్ (వస్తు మార్పిడి) ఇప్పుడు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు బాంబుల వెనుక చైనా ఆడుతున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? డాలర్ పతనం కోసం జరుగుతున్న ఈ కుట్ర వల్ల రేపు మన దేశంలో సామాన్యుడి బతుకు ఎలా మారబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.


US vs Iran Real Reason


డాలర్ సామ్రాజ్యానికి ఎసరు.. చైనా పేమెంట్ లూప్


ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడుల వెనుక డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకునే అతిపెద్ద వ్యూహం దాగి ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రహస్య ఆర్థిక యుద్ధానికి చైనాలోని ఒక చిన్న వాణిజ్య బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ కున్లున్' (Bank of Kunlun) కేంద్ర బిందువుగా మారింది.


మెగ్నమ్ ఫిన్వెస్ట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ చెబుతున్న లెక్కల ప్రకారం.. చైనా అత్యంత తెలివిగా ఒక 'పేమెంట్ లూప్'ను క్రియేట్ చేసింది. డాలర్లతో అస్సలు పనిలేకుండా నెలకు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ చమురును చైనా ఎంచక్కా కొనేస్తోంది.


ఆంక్షల నుంచి తప్పించుకునే బార్టర్ సిస్టమ్


అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ చమురును కాస్తా 'మలేషియా చమురు'గా నకిలీ పత్రాలతో మార్చి చైనాకు రవాణా చేస్తున్నారు. ఇరాన్ చమురు అమ్మగా వచ్చిన డబ్బులు చైనా కరెన్సీ అయిన 'యువాన్'ల రూపంలో కున్లున్ బ్యాంక్ ఖాతాల్లో పడతాయి.


కానీ, అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఆ యువాన్లను ఇరాన్ వేరే దేశాల్లో వాడుకునే ఛాన్స్ లేదు. దీంతో ఇరాన్ ఆ డబ్బుతో మళ్లీ చైనా నుంచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తోంది. అంటే చైనా ఇచ్చిన డబ్బు, మళ్లీ వస్తువుల రూపంలో చైనాకే చేరుతోంది. దీన్నే మోడ్రన్ బార్టర్ సిస్టమ్ (వస్తు మార్పిడి) అంటారు.


డ్రాగన్ మాస్టర్ మైండ్.. సైలెంట్ ఎందుకు ఉందంటే!


ప్రస్తుతం ఇరాన్ అమ్మే చమురులో 90 శాతం చైనాకే వెళ్తోంది. అది కూడా బ్యారెల్‌కు 10 డాలర్ల భారీ డిస్కౌంట్‌తో! ఈ బార్టర్ సిస్టమ్ వల్ల అంతర్జాతీయంగా అమెరికా డాలర్ ప్రాముఖ్యత పూర్తిగా పడిపోతోంది. ఇది అమెరికా ఎకానమీకి గొడ్డలిపెట్టు. అందుకే 2012లోనే అమెరికా ఈ బ్యాంక్‌పై ఆంక్షలు విధించినా, చైనా మాత్రం డోంట్ కేర్ అంటోంది.


యుద్ధం మొదలయ్యాక చైనా కావాలనే పక్కా ప్లాన్‌తో తమ యువాన్ విలువను తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు. కరెన్సీ విలువ తగ్గితే చైనా ఎగుమతులు అమాంతం పెరిగి, ఆ దేశంలో నిరుద్యోగం తగ్గుతుంది.


ఇరాన్‌కు చైనా ఎంత అవసరమో, చైనా ఎకానమీకి ఇరాన్ చమురు అంత అవసరం. తన ఆర్థిక ప్రయోజనాల కోసమే చైనా పైకి శాంతి వచనాలు వల్లిస్తూ, ఇరాన్‌కు డైరెక్ట్‌గా సైనిక మద్దతు ఇవ్వకుండా సేఫ్ గేమ్ ఆడుతోంది.


ఈ డాలర్ vs యువాన్ కరెన్సీ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎప్పుడెలా మారతాయో ఊహించడం కష్టం. డాలర్ ఆధిపత్యం దెబ్బతింటే అది పరోక్షంగా గ్లోబల్ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దిగుమతులపై ఆధారపడే మన దేశంలో పెట్రోల్, నిత్యావసరాల ధరలు భగ్గుమనడానికి ఈ భౌగోళిక ఆర్థిక కుట్రలే ప్రధాన కారణం. కాబట్టి సామాన్యులు కేవలం వీటిని యుద్ధ వార్తల్లా కాకుండా, తమ జేబుకు చిల్లుపెట్టే ఎకనామిక్ వార్ గా గుర్తించి ఆర్థిక పొదుపు పాటించడం అత్యవసరం.