నడిపించిన నాయకుడిపైనే సొంత రక్తం తిరుగుబాటు చేస్తే? తెలంగాణ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మహా భూకంపం ఇది! ఒక సామాన్యుడిగా మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని ప్రశ్నించాలో అయోమయంలో ఉన్న వేళ.. కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకప్పుడు గులాబీ బాస్ కుడిభుజంగా ఉన్న ఆమె, ఇప్పుడు తండ్రిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ సొంత పార్టీతో మీ ముందుకు రావడం సామాన్యుడి బతుకులో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది?
ఉదయించిన కొత్త గులాబీ.. మళ్లీ 'టీఆర్ఎస్'!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో సరికొత్త సునామీ సృష్టించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆమె తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు.
ఊహించని రీతిలో కేసీఆర్ కు సెంటిమెంట్ షాక్.. టీఆర్ఎస్ ( తెలంగాణ రాష్ట్ర సేన )అని పార్టీ పేరును ప్రకటించిన కవిత#TRS #Telangana pic.twitter.com/ccxwnikSVW
— Telugu360 (@Telugu360) April 25, 2026
తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన పాత పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)ను తన కొత్త పార్టీకి నామకరణం చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కలయికలో.. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై 'TRS' అనే అక్షరాలతో రూపొందించిన పార్టీ జెండాను సగర్వంగా ఆవిష్కరించారు.
తప్పులకు క్షమాపణ.. బీఆర్ఎస్‌కు ఆత్మ లేదు!
తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోవడం వల్లే తాను ఈ కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చిందని కవిత సభాముఖంగా స్పష్టం చేశారు. "ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు.. రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ 12 ఏళ్లైనా మన కలలు పూర్తిగా నెరవేరలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ నేత కేసీఆర్ అభివృద్ధి రథం పూర్తిగా గాడి తప్పిందని ఆమె కుండబద్దలు కొట్టారు. "గతంలో జరిగిన తప్పుల్లో నేను కూడా భాగస్వామినే.. ఆ తప్పులకు ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా, వాటిని సరిదిద్దుకునేందుకే ఈ ప్రయత్నం" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
కేసీఆర్ మర మనిషి.. గుంట నక్కల చేతిలో బందీ!
ఒకప్పటి కేసీఆర్‌కు, ఇప్పటి కేసీఆర్‌కు ఏమాత్రం పొంతన లేదని కవిత విరుచుకుపడ్డారు. "ఇప్పుడున్న కేసీఆర్ మారిన మనిషి కాదు.. ఆయనో మర మనిషి, మన మనిషి కానే కాదు" అంటూ కళ్లు చెదిరే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు కష్టం వస్తే కేసీఆర్ బయటకు రావడం లేదని, ఆయన గుంట నక్కల చేతుల్లో బందీ అయిన ఒక ఖైదీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తుంటే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయనకు అధికారంపై మమకారం తగ్గి రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరంలో అవినీతి.. అందుకే సస్పెన్షన్!
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని తాను ప్రశ్నించినందుకే.. తనను పక్కనపెట్టి పందికొక్కులను పక్కన పెట్టుకున్నారని కవిత అసలు గుట్టు విప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసీఆర్ మంచే చేశారని, బీఆర్ఎస్‌లో ఉండి తాను గట్టిగా పోరాడలేకపోయానని స్పష్టం చేశారు.
బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేదని విమర్శించిన ఆమె.. బీఆర్ఎస్ పార్టీ సైతం నీళ్లు, నిధులు, నియామకాలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కేసీఆర్ మారుతారని ఇన్నాళ్లూ వేచి చూసినా ఫలితం లేకపోవడం వల్లే ఇప్పుడు రాష్ట్రం కోసం పోరాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
మూడున్నర కోట్ల మందికి అమ్మను అవుతా!
సామాజిక తెలంగాణే తన ఏకైక లక్ష్యమని కవిత ఉద్ఘాటించారు. "తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు ఒక అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నా.. అమ్మతనంతో పాలన సాగితేనే ప్రజల కష్టాలు తీరుతాయి" అని భరోసా ఇచ్చారు.
ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. "In Front There Is Crocodile Festival" (ముందుంది ముసళ్ల పండుగ) అంటూ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చారు. ఇప్పుడు తామే అసలైన ప్రతిపక్షమని, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తెలంగాణ రాష్ట్ర సేన పార్టీయేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
అమరులకు నివాళి.. సీఎం నేనే!
పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తన భర్త, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం, భారీ ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్తూపానికి చేరుకుని నివాళులర్పించారు.
తెలంగాణలో సరికొత్త విప్లవం రాబోతోందని.. తాను కచ్చితంగా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని కవిత సగర్వంగా ప్రకటించారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకనై ప్రాణమున్నంత వరకు వారి కోసమే పోరాడుతానని స్పష్టం చేశారు.
ఒకనాడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికే భయపడిన రాజకీయ నాయకులున్న గడ్డపై.. ఇప్పుడు స్వయంగా ఉద్యమ నాయకుడి కుటుంబంలోనే చెలరేగిన ఈ ఆధిపత్య పోరు సామాన్యుడిని విస్మయపరుస్తోంది! తప్పు జరిగిందని క్షమాపణ చెప్పడం రాజకీయ నాయకులకు అరుదైన లక్షణమే అయినా.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల అవినీతిలో వాటా ఎవరిది అన్నది అసలు ప్రశ్న. ఒకప్పుడు గులాబీ బాస్‌కు అండగా ఉన్న ఆమె, ఇప్పుడు ఆ పార్టీ పునాదులను కదిలిస్తే బలోపేతం అయ్యేది ప్రతిపక్షాలా? లేక స్వయంగా ఆమె పార్టీనా? ఏది ఏమైనా, రాబోయే రెండేళ్లలో తెలంగాణ రాజకీయాలు ఏ హాలీవుడ్ థ్రిల్లర్‌కూ తీసిపోవన్నది అక్షర సత్యం!
Also Read:
తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. వర్షాలపై తాజా అప్డేట్!Telangana New DGP: తెలంగాణ తదుపరి పోలీస్ బాస్ సీవీ ఆనంద్
TGSRTC Strike Ends : ముగిసిన ఆర్టీసీ సమ్మె, రోడ్డెక్కిన బస్సులు
Duscherla Satyanarayana : దుశ్చర్ల సత్యనారాయణకు సీఎం అండ
బీజేపీ ఆఫీసులో మల్లారెడ్డి కోడలు.. పార్టీ మార్పుపై ప్రీతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

