ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికల క్షేత్రం.. ఇప్పుడు కోటీశ్వరుల ఖజానాగా, నేరచరితుల అడ్డాగా మారిపోయిందా? తమిళనాట అభ్యర్థుల ఆస్తులు, కేసుల చిట్టా విప్పిన ఏడీఆర్ (ADR) నివేదిక.. రాజకీయాల్లో దాగున్న భయంకరమైన, కళ్లు చెదిరే నిజాలను బట్టబయలు చేసింది!
నేరాల చదరంగంలో అభ్యర్థులు.. పాత రికార్డులు బద్దలు!
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4,023 మంది పోటీ పడుతుండగా.. 3,992 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నిశితంగా పరిశీలించింది. ఇందులో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగుచూశాయి. గత ఎన్నికల కంటే ఈసారి క్రిమినల్ అభ్యర్థుల సంఖ్య భయంకరంగా పెరిగింది. 2021లో 13 శాతంగా ఉన్న నేరచరితులు, ఇప్పుడు ఏకంగా 18 శాతానికి (722 మందికి) చేరుకున్నారు.
ఇందులో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు 6 నుంచి ఏకంగా 10 శాతానికి (44 మందికి) పెరగడం గమనార్హం. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల్లోనే ఈ నేర చరిత్ర ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఏకంగా 18 మందిపై మహిళలపై దాడులు చేసిన కేసులు, 13 మందిపై హత్యా నేరాలు, 44 మందిపై హత్యాయత్నం కేసులు ఉండటం ప్రజాస్వామ్యానికే పెను సవాల్.
డేంజర్ జోన్‌లో ఆ నియోజకవర్గాలు!
నేరచరితులు అత్యధికంగా పోటీ చేస్తున్న స్థానంగా తిరునల్వేలి నియోజకవర్గం రికార్డుకెక్కింది. ఇక్కడ బరిలో ఉన్న 20 మందిలో ఏకంగా 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తిరుప్పరంకుండ్రం, కరూర్ నియోజకవర్గాలు నిలిచాయి. ఇక్కడ ఎనిమిది మంది చొప్పున నేరచరితులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కుబేరుల క్యూ.. 20 వేల కోట్ల సామ్రాజ్యం!
ఈ ఎన్నికల కురుక్షేత్రంలో కుబేరులకు ఏమాత్రం కొదవ లేదు. పోటీలో ఉన్న వారిలో ఏకంగా 981 మంది కోటీశ్వరులు ఉండగా.. వీరందరి ఆస్తుల విలువ కళ్లు చెదిరేలా అక్షరాలా రూ. 20,678 కోట్లుగా ఏడీఆర్ తేల్చింది! పది శాతానికి పైగా (10.40%) అభ్యర్థులకు ఐదు కోట్లకు మించి ఆస్తులుండగా.. 50 లక్షల నుంచి 5 కోట్ల మధ్య ఆస్తులున్న వారు 25 శాతం మంది ఉన్నారు.
బిలియనీర్ల జాబితాలో విజయ్ పార్టీదే అగ్రస్థానం!
ఈ దఫా ఎన్నికల్లో ఏకంగా 22 మంది బిలియనీర్లు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆశ్చర్యకరంగా, పార్టీల వారీగా చూస్తే స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీలోనే అత్యధికంగా 8 మంది బిలియనీర్లు ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే నుంచి ఏడుగురు, అన్నాడీఎంకే నుంచి ఐదుగురు కుబేరులు పోటీలో ఉన్నారు.
కళ్లు చెదిరే ఆస్తులు.. సగటున అన్నాడీఎంకే టాప్!
లాల్గుడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన లీమా రోజ్.. ఏకంగా రూ. 5,863 కోట్ల ఆస్తులతో అందరినీ వెనక్కినెట్టి అత్యంత ధనవంతురాలిగా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత టీవీకే అధినేత, నటుడు విజయ్ జోసెఫ్ రూ. 648 కోట్లతో రెండో స్థానంలో, అదే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున్ రూ. 534 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.
సగటు ఆస్తుల పరంగా చూస్తే.. 170 మంది అఫిడవిట్లతో అన్నాడీఎంకే సగటున రూ. 53 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి రూ. 27 కోట్లు, ఏఎంఎంకే రూ. 26 కోట్లు, డీఎంకే రూ. 21 కోట్లు, టీవీకే రూ. 16 కోట్లు, ఇక బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ. 14 కోట్లుగా నమోదైంది.
కేసుల్లో టాప్ ఎవరంటే.. ఉదయనిధి సెకండ్!
పూంపుహార్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న ఎం. మాయ వెంకటేశన్‌పై అత్యధికంగా 12 కేసులు ఉన్నాయి. ఇందులో 22 తీవ్రమైన నేరారోపణల సెక్షన్లు నమోదు కావడం గమనార్హం.
ఇక చేపాక్-ట్రిపులికేన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న డిప్యూటీ సీఎం, డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్.. 9 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. ఆయనపై మత విశ్వాసాలకు విఘాతం కలిగించడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం లాంటి ఏకంగా 20 తీవ్రమైన సెక్షన్లు ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
దినదిన గండంగా బతికే సామాన్యుడి చేతిలో ఉన్న ఓటు.. వేల కోట్లున్న కుబేరుల, నేరచరితుల తలరాతలను శాసించే ఆయుధంగా మారుతుందా? లేక ఆ డబ్బు, కండబలమే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తుందా అన్నది తమిళనాట ఓటరు దేవుడే తేల్చాలి!
Also Read:
Thalapathy Vijay Divorce: విజయ్, సంగీత విడాకుల సెటిల్మెంట్సింధూరం, తిలకం బ్యాన్? లెన్స్‌కార్ట్ డ్రెస్ కోడ్‌పై పెను దుమారం!
తగ్గేదేలే అన్న సూర్య.. తెలంగాణకు క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి
కెమెరా ముందు కాదు, పార్లమెంట్లో మాట్లాడండి: మోదీకి దీదీ సవాల్!
Women Reservation Bill FAQs: మహిళా బిల్లుపై కేంద్రం క్లారిటీ

