ఒకప్పుడు డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉంటే చాలు, పచ్చటి ఉద్యోగం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ 2026 నాటికి కార్పొరేట్ ప్రపంచం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మీరు రాసే కోడింగ్, మీరు చేసే డేటా ఎంట్రీ, మీరు గీసే డిజైన్లన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం సెకన్ల వ్యవధిలో చేసి పడేస్తోంది. మరి యంత్రాలు చేయలేని, కేవలం మనుషులు మాత్రమే చేయగల పనులేంటి? మీ ఆఫీసులో ఒకసారి గమనించారా.. మీకంటే తక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మీకంటే వేగంగా ప్రమోషన్లు కొట్టేసి ఆఫీసులో మేనేజర్ స్థానంలో కూర్చోవడానికి కారణం ఏంటి?ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం.. సాఫ్ట్ స్కిల్స్ (Soft Skills). టెక్నికల్ నాలెడ్జ్ మిమ్మల్ని కేవలం ఇంటర్వ్యూ గది వరకే తీసుకువెళుతుంది, కానీ సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే మీ కెరీర్‌ను అగ్రస్థానంలో నిలబెడతాయి. ఏ రంగానికి వెళ్లినా సరే, మీ కెరీర్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఆ సూపర్ పవర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కమ్యూనికేషన్.. విజయానికి తొలి మెట్టు
సాఫ్ట్ స్కిల్స్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడటం. కానీ కార్పొరేట్ ప్రపంచంలో కమ్యూనికేషన్ అంటే కేవలం ఒక భాష కాదు. మీ మెదడులో ఉన్న అద్భుతమైన ఐడియాను, ఎదుటివారికి ఎంత సులభంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు అనేదే అసలైన కమ్యూనికేషన్.
మీరు ఎంత గొప్ప సాఫ్ట్‌వేర్ తయారు చేసినా, దాని వల్ల కంపెనీకి జరిగే లాభాన్ని మీ బాస్‌కు లేదా క్లయింట్‌కు వివరించలేకపోతే మీ శ్రమ అంతా వృధా అవుతుంది. అలాగే ఇతరులు చెప్పేది ఓపికగా వినడం అనేది కూడా కమ్యూనికేషన్‌లో అత్యంత కీలకమైన భాగం. వినే ఓపిక ఉన్నవారే ఆఫీసులో అందరి మన్ననలు పొందుతారు.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్.. ఏఐకి అందని ద్రాక్ష
యంత్రాలు ఎంత వేగంగా పనిచేసినా అవి మనుషుల్లా భావోద్వేగాలను పంచుకోలేవు. సరిగ్గా ఇక్కడే 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' ఉన్న ఉద్యోగులకు మార్కెట్లో కళ్లు చెదిరే డిమాండ్ ఏర్పడింది. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, తోటి ఉద్యోగి మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం, కస్టమర్ల సైకాలజీని అర్థం చేసుకుని వారితో ప్రశాంతంగా మెలగడం లాంటివి దీని కిందికే వస్తాయి. ఏఐ యుగంలో మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాత్రమే మిమ్మల్ని ఒక గొప్ప లీడర్‌గా నిలబెడుతుంది అని గ్లోబల్ హెచ్ఆర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అడాప్టబిలిటీ.. మారుతున్న కాలంతో పరుగులు
ఒకప్పుడు మనం కాలేజీలో నేర్చుకున్న విద్య జీవితాంతం పనిచేసేది. కానీ ఇప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సరికొత్త టెక్నాలజీ మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఇలాంటి వేగవంతమైన వాతావరణంలో 'అడాప్టబిలిటీ' (Adaptability) అనగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం చాలా అవసరం.
కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చినప్పుడు భయపడి పాత పద్ధతులనే పట్టుకులాడే వారిని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేస్తున్నాయి. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ, మార్పును సానుకూలంగా స్వాగతించే ఉద్యోగులకే ఇప్పుడు ఎక్కడైనా రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోంది. ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారే భవిష్యత్తులో సర్వైవ్ అవుతారు.
ప్రాబ్లమ్ సాల్వింగ్.. సమస్యలోనే పరిష్కారం
ఆఫీసులో ఎప్పుడూ ఒక వర్గం వారు సమస్యల గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. 'సర్వర్ పనిచేయట్లేదు, క్లయింట్ ఒప్పుకోవట్లేదు' అంటూ ప్రతి చిన్న దానికి సాకులు చెబుతుంటారు. కానీ యాజమాన్యానికి కావాల్సింది సమస్యలు చెప్పేవారిని కాదు, పరిష్కారాలు చూపే వారిని. ఒక ఊహించని సమస్య ఎదురైనప్పుడు, ప్రశాంతంగా ఆలోచించి దానికి ప్రత్యామ్నాయ దారులను వెతికిపెట్టే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ (Critical Thinking) ఉన్నవారిని ఏ కంపెనీ కూడా వదులుకోదు. సమస్యను ఒక అవకాశంగా మార్చుకునే ఈ స్కిల్, మీ కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేస్తుంది.
టీమ్‌వర్క్.. కలిసి అడుగులేస్తేనే విజయం
ఆధునిక కార్పొరేట్ వ్యవస్థలో ఏ ఒక్కరూ ఒంటరిగా అద్భుతాలు సృష్టించలేరు. డిజైనర్, డెవలపర్, మార్కెటింగ్ టీమ్.. ఇలా అందరూ కలిసి పనిచేస్తేనే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. మీలో ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా సరే, తోటి వారితో కలిసి పనిచేయలేని ఇగో ఉంటే కంపెనీలకు మీరు భారంగానే కనిపిస్తారు. ఇతరుల ఐడియాలను గౌరవించడం, క్రెడిట్ పంచుకోవడం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు టీమ్ మెంబర్స్‌కు సహాయం చేయడం లాంటివి అత్యుత్తమ ప్రొఫెషనల్స్‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. ఒక మంచి 'టీమ్ ప్లేయర్' ఎప్పుడూ సంస్థకు అసెట్ అవుతాడు.
ఇవి సాఫ్ట్ స్కిల్స్ కాదు.. హార్డ్ రియాలిటీ
రాబోయే రోజుల్లో రిక్రూటర్లు మీ సర్టిఫికెట్లలో ఉన్న గ్రేడ్ల కంటే, మీలో ఉన్న సాఫ్ట్ స్కిల్స్‌కే ఎక్కువ మార్కులు వేయబోతున్నారు. కోడింగ్ లేదా డిజైనింగ్ లాంటి హార్డ్ స్కిల్స్‌ను ఎవరికైనా రెండు మూడు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి సులభంగా నేర్పించవచ్చు. కానీ నిజాయితీ, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ లాంటి నైపుణ్యాలను ఎవరూ క్లాస్ రూమ్‌లో బట్టీ పట్టించలేరు. అవి మీరు సొంతంగా మీ రోజువారీ జీవితంలో ప్రాక్టీస్ ద్వారా అలవర్చుకోవాలి.
అందుకే, టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తున్నారో, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ఈ సాఫ్ట్ స్కిల్స్ కోసం కూడా కనీసం అంతే సమయం కేటాయించండి. "నేను మాట్లాడలేను, నా పని నేను సైలెంట్‌గా చేసుకుంటాను" అనే మైండ్‌సెట్ నుంచి బయటకు రండి. ఇతరులతో ప్రొఫెషనల్‌గా మాట్లాడటం, మీ టీమ్‌ను ముందుండి నడిపించడం ప్రారంభించండి.

