[FEATURED_IMAGE]
సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే కథ, తమ పాత్ర, బడ్జెట్, మార్కెట్ లెక్కలు అన్నీ ఆచితూచి బేరీజు వేసుకుంటారు. కానీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో సూర్య ఈ లెక్కలన్నీ పక్కనపెట్టేశారు. 'లక్కీ భాస్కర్' సినిమా సూర్యపై చూపించిన ఇంపాక్ట్ ఎంత బలమైనదంటే, వెంకీతో ఎలాగైనా వర్క్ చేయాలని ఆయన బలంగా మానిఫెస్ట్ చేసుకున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ కథ వినకముందే తనపై ఇంతటి నమ్మకం పెట్టుకోవడం అనేది ఏ డైరెక్టర్‌కైనా దక్కే అతి పెద్ద ప్రశంస అని చెప్పవచ్చు.
ఇటీవల జరిగిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈవెంట్‌లో సూర్య ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. నిర్మాత నాగవంశీ ఫోన్ చేసి వెంకీ అట్లూరి డేట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పగానే తాను వెంటనే ఓకే చెప్పేశానని ఆయన స్పష్టం చేశారు. అయితే, మొదట ఈ కాంబినేషన్‌లో ఒక బయోపిక్ తెరకెక్కించాలని వెంకీ ప్లాన్ చేశారు. కానీ అప్పటికే కొన్ని బయోపిక్స్ చేసి ఉన్న సూర్య, ప్రస్తుతానికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేద్దామని సూచించడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.
ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఒక దర్శకుడి పనితనం మీద హీరోకు ఉండే నమ్మకం ఎంతటి అద్భుతాలకు దారితీస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది. సూర్య పెట్టుకున్న ఈ బ్లైండ్ ట్రస్ట్‌తో వెంకీ అట్లూరి భుజాలపై ఇప్పుడు భారీ బాధ్యతే పడింది. మరి సూర్య నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వెంకీ ఎలాంటి బ్లాక్ బస్టర్ డెలివరీ చేయబోతున్నారో తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే. భారీ అంచనాలతో థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

