తమిళ స్టార్ హీరో విజయ్ బాటలోనే యంగ్ హీరో శివకార్తికేయన్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా అన్న చర్చ కోలీవుడ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల చెన్నైలోని పోరూర్‌లో సుమారు 3 వేల మంది ఫ్యాన్స్, అసోసియేషన్ లీడర్లతో శివకార్తికేయన్ నిర్వహించిన రహస్య భేటీ పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ సమావేశంలో ఆయన రాజకీయాల గురించి సూటిగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, వేలాది మంది అభిమానులను ఏకం చేసి లక్ష్యం, క్రమశిక్షణపై సందేశం ఇవ్వడం భవిష్యత్ రాజకీయ ప్రవేశానికి గట్టి పునాది అనే అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
[FEATURED_IMAGE]తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వెండితెర తారల గ్లామర్‌తోనే ముడిపడి ఉంటాయి. దళపతి విజయ్ సొంత పార్టీని ప్రకటించి క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేయగా, మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ కూడా పొలిటికల్ ఎంట్రీకి సై అంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ తరుణంలోనే కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హీరో శివకార్తికేయన్ పేరు కూడా అనూహ్యంగా రాజకీయ తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఆదివారం నాడు చెన్నైలోని పోరూర్‌లో శివకార్తికేయన్ తన అభిమానులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3 వేల మంది అభిమానులు, వివిధ ప్రాంతాల ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒకేచోట చేరడంతో ఈ మీటింగ్ సరికొత్త చర్చకు దారితీసింది. వేదికపై తన రాజకీయ రంగ ప్రవేశం గురించి శివకార్తికేయన్ ఎలాంటి స్పష్టమైన వ్యాఖ్యలూ చేయకుండా ఆచితూచి వ్యవహరించడం విశేషం.
సభలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అభిమానుల ప్రేమేనని కృతజ్ఞతలు తెలిపారు. ఏ రంగంలోనైనా గెలవాలంటే మన లక్ష్యంపై మనకు పూర్తి స్పష్టత ఉండాలని, విమర్శించే వాళ్లను అసలు పట్టించుకోకుండా గమ్యం వైపే అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బాగా చదువుకుని డబ్బు సంపాదించాలని, కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎక్కువ చదువుకోవడం వల్ల మన ఆలోచనా ధోరణి మెరుగై, అనవసరమైన సోషల్ మీడియా వ్యామోహాలకు దూరంగా ఉండొచ్చని హితవు పలికారు.
శివకార్తికేయన్ వ్యక్తిగతంగా ఎలాంటి పొలిటికల్ ప్రకటన చేయకపోయినా, ఇంత భారీ స్థాయిలో అభిమానులను సమీకరించి మార్గదర్శనం చేయడం వెనుక భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ స్టార్, రాబోయే రోజుల్లో వెండితెర ఇమేజ్‌ను ఓటు బ్యాంకుగా మలచుకుని తమిళ రాజకీయాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించనున్నారో వేచి చూడాల్సిందే.

