జలుబు, జ్వరమొస్తే డాక్టర్ వద్దకు వెళ్లకుండా నేరుగా వీధి చివర ఉన్న మెడికల్ షాపుకు వెళ్లి మందులు అడుగుతున్నారా? వారు ఇచ్చిన పచ్చ, ఎర్ర మాత్రలు వేసుకుని తగ్గిపోయిందని మురిసిపోతున్నారా? అయితే మీ ప్రాణాలకు మీరే పొగపెట్టుకుంటున్నట్లే!
వరంగల్ జిల్లాలో మెడికల్ మాఫియా పడగవిప్పింది. మీ రోగాన్ని తగ్గించాల్సిన మందులే మీ కిడ్నీలను, ఇమ్యూనిటీని డ్యామేజ్ చేసే స్థాయికి చేరాయి. రోగి ప్రాణాలతో ఆడుకుంటున్న ఔషధ విక్రయదారుల ఆగడాలు, చోద్యం చూస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారుల నిర్వాకం ప్రతి సామాన్యుడిని భయపెడుతున్నాయి. అసలు వరంగల్ మెడికల్ షాపుల్లో జరుగుతున్న దందా ఏంటి? మనం తీసుకుంటున్న మందులు ఎంతవరకు సురక్షితం? ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన వాస్తవాలివే.
[FEATURED_IMAGE]ప్రిస్క్రిప్షన్ లేదు.. క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేడు!
వరంగల్ నగర పరిధిలోనే సుమారు 1,500, ఇక జిల్లావ్యాప్తంగా చూస్తే ఏకంగా 5 వేల వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ మాత్రమే మందులు ఇవ్వాలి. కానీ, ఎక్కడ చూసినా ఫార్మసీ సర్టిఫికెట్లను అద్దెకు తెచ్చుకుని బోర్డులు తగిలించి, కేవలం పదో తరగతి చదివిన కుర్రాళ్లతో మందులు అమ్మిస్తున్నారు.
వీరికి రోగి ఆరోగ్యంతో పట్టింపు లేదు. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ (చీటీ) లేకుండానే హైడోస్ యాంటీబయాటిక్స్, అన్ వాంటెడ్ కిట్లు (అబార్షన్ కిట్లు), ప్రాణాంతక స్టెరాయిడ్స్, మత్తు ఇంజెక్షన్లు యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. చిన్న జలుబు, దగ్గుకు సైతం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అంటగడుతూ సామాన్యుల రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు.
నాసిరకం మందులతో ప్రాణాలకు ఎసరు
మనం డాక్టర్ రాసిన చీటీ ఇస్తే.. అందులో ఉన్న మందులు కాకుండా వేరే బ్రాండ్ల నాసిరకం మందులను మన చేతిలో పెడుతున్నారు. "డాక్టర్ రాసిన మందులు ఇవ్వండి" అని రోగి ప్రశ్నిస్తే.. "కంపెనీ మాత్రమే వేరండి, లోపల ఉండే ఫార్ములా ఒక్కటే" అంటూ బుకాయిస్తున్నారు.
దీని వెనుక పెద్ద ఆర్థిక కుట్ర దాగి ఉంది. పేరున్న కంపెనీల మందులపై వచ్చే లాభం కంటే, నాసిరకం మందులపై వచ్చే మార్జిన్ (లాభం) అత్యధికంగా ఉంటుంది. కేవలం ఆ లాభాలకు ఆశపడే రోగుల నెత్తిన ఈ కల్తీ మందులను రుద్దుతున్నారు.
బిల్లులు ఇవ్వరు.. జీరో దందాతో జీఎస్టీ గోల్‌మాల్
ఇదంతా ఒక ఎత్తైతే.. రోగులు కొన్న మందులకు మెడికల్ షాపుల్లో కనీసం బిల్లులు ఇవ్వడమే మర్చిపోయారు. పూర్తిగా 'జీరో దందా' నడుపుతూ పన్నుల ఎగవేతకు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మందులపై తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలు సైతం ఈ బిల్లుల గోల్‌మాల్ వల్ల సామాన్యుడికి దక్కడం లేదు.
మరోవైపు కార్పొరేట్ కంపెనీల మెడికల్ షాపుల హవా కూడా ప్రమాదకరంగా మారుతోంది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో సైతం తమ ఔట్‌లెట్లను తెరిచి, తమ సొంత కంపెనీ బ్రాండ్ల మందులనే కొనేలా రోగులను మభ్యపెడుతున్నాయి.
అధికారుల అండతోనే మెడికల్ మాఫియా ఇష్టారాజ్యం?
జిల్లాలో ఇంత పెద్ద మెడికల్ మాఫియా బహిరంగంగా నడుస్తున్నా.. పట్టించుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ (ఔషధ నియంత్రణ) అధికారుల జాడ ఎక్కడా లేదు. ఇటీవలి కాలంలో జిల్లాలో ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలే కరువయ్యాయి. దీనికి కారణం ఆ మాఫియాకు అధికారులే అండగా నిలుస్తుండటమేనన్న తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్న 'మెడికల్ షాపుల అసోసియేషన్' కనుసైగల్లోనే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు నడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు చేయకపోవడానికి కారణం మాఫియా నేరుగా వారిని శాసించడమేనని స్థానికంగా చర్చ జరుగుతోంది.
మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి. మెడికల్ షాపులో బిల్లు ఇవ్వకుండా మందులు ఇస్తే నిర్మొహమాటంగా తిరస్కరించండి. బిల్లు అడగడం మీ హక్కు (బిల్లు ఉంటేనే రేపు రియాక్షన్ వస్తే కేసు వేయగలం). డాక్టర్ రాసిన మందు కాకుండా, ఏదేదో బ్రాండ్ ఇస్తే అస్సలు తీసుకోకండి. చిన్న జ్వరానికి డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే.. రేపు పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఏ మందూ మీ ఒంటికి పనిచేయదు. ఫార్మసిస్ట్ లేని షాపులో మందులు కొనడం అంటే.. లైసెన్స్ లేని డ్రైవర్ నడుపుతున్న బస్సులో ప్రయాణించడమే! ఈ మెడికల్ మాఫియా వలలో పడకుండా అప్రమత్తంగా ఉండండి.

