టాలీవుడ్ సంప్రదాయాలపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమయంలో పక్కనే ఉన్న మహానటి కీర్తి సురేష్, ఎట్టకేలకు ఈ అంశంపై మౌనం వీడారు. తన రాబోయే సినిమా 'సత్యవాన్ సావిత్రి' ప్రమోషన్లలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానం ఇచ్చారు. నార్త్ మీడియా ముందు మన దక్షిణాది సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని కీర్తి సురేష్ తేల్చి చెప్పారు.
[FEATURED_IMAGE]
నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్ల సమయంలో నటి రాధికా ఆప్టే తెలుగు సినిమాలపై, ఇక్కడి వివాహ సంప్రదాయాలపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారమే రేపాయి. ఆ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ కూడా రాధికా ఆప్టే పక్కనే ఉండటంతో, టాలీవుడ్ అభిమానులు, నెటిజన్లు కీర్తిని సైతం విమర్శించారు. ఆ సమయంలో రాధికా మాటలను కీర్తి ఎందుకు ఖండించలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
'సత్యవాన్ సావిత్రి' ప్రమోషన్లలో మీడియా ప్రశ్నల వర్షం
ప్రస్తుతం కీర్తి సురేష్ తన తదుపరి చిత్రం 'సత్యవాన్ సావిత్రి' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ రాధికా ఆప్టే వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో ఆ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ, ఒక తెలుగు సినిమాలో తనకంటే పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, తన పాత్రకు అంకుల్తో పెళ్లి జరిగే సన్నివేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కీర్తి స్పందిస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మేనమామలను వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని వివరించే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పేర్లే ఎందుకు చెప్పానంటే!
రాధికా ఆప్టే అలా మాట్లాడినప్పుడు వెంటనే ఎందుకు అడ్డుకోలేదని జర్నలిస్ట్ ప్రశ్నించగా, అసలు రాధికా ఏం చెప్పాలనుకుంటున్నారో మొదట తనకు పూర్తిగా అర్థం కాలేదని కీర్తి సురేష్ బదులిచ్చారు. అందుకే ఆ సంప్రదాయం వెనుక ఉన్న అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశానని తెలిపారు. అలాగే కేరళ గురించి ప్రస్తావించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పేర్లనే ఎందుకు చెప్పారన్న ప్రశ్నకు, ఆ రెండు రాష్ట్రాల్లోనే ఆ ఆచారం ఉందని తనకు తెలుసని, కేరళలో అలాంటి సంప్రదాయం లేదని, కర్ణాటక గురించి తనకు తెలియదని కీర్తి స్పష్టత ఇచ్చారు.
మన సంస్కృతిని తక్కువ చేసే ప్రసక్తే లేదు
తన మాటల వెనుక ఉన్న ఉద్దేశం కేవలం ప్రాంతీయ సంస్కృతుల మధ్య ఉండే భిన్నత్వాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం మాత్రమేనని కీర్తి సురేష్ తేల్చి చెప్పారు. "నార్త్ మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు మన సంస్కృతిని నేనెందుకు తక్కువ చేసి చూపిస్తాను? వారి ముందు మన సంప్రదాయాలను కించపరిచే ప్రసక్తే లేదు" అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. మొత్తానికి కీర్తి ఇచ్చిన ఈ క్లారిటీతో ఇన్నాళ్లుగా ఆమెపై ఉన్న అపోహలకు తెరపడినట్లయింది.

