కృత్రిమ మేధస్సు (AI) వల్ల తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని పలు రంగాల ఉద్యోగులు ఆందోళన చెందుతున్న వేళ, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ది AI ట్రూత్ బాంబ్' పేరుతో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి AIతో ఉద్యోగులే రహస్యంగా లాభపడుతూ, ఆ పనంతా తామే చేశామని బాస్‌ల ముందు నటిస్తున్నారని ఆర్జీవీ ఘాటుగా విమర్శించారు. AIని ఉపయోగించే వారే, దాన్ని వాడని వారి స్థానాన్ని భర్తీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
[FEATURED_IMAGE]ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఐటీ, మార్కెటింగ్ సహా పలు కార్పొరేట్ రంగాలలో ఉద్యోగాల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ది AI ట్రూత్ బాంబ్' అనే శీర్షికతో విడుదల చేసిన సుదీర్ఘ విశ్లేషణ ఇప్పుడు ఆఫీసుల్లోనూ, నెట్టింటా హాట్ టాపిక్‌గా మారింది. తమ ఉపాధిని AI లాగేసుకుంటోందని వాపోతున్న ఉద్యోగులే, తెరవెనుక AI సాయంతో తమ పనులను చక్కబెట్టుకుంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆర్జీవీ సంచలన ఆరోపణలు చేశారు.
బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేస్తూ దొంగ నాటకాలు!
ఉద్యోగులు తమంతట తామే AIతో రీప్లేస్ చేసుకుంటున్నారనే చేదు నిజాన్ని వర్మ ఉదాహరణలతో సహా వివరించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 'క్లాడ్' వంటి టూల్స్‌లో ప్రాంప్ట్ ఇచ్చి నిమిషాల్లో కోడింగ్ ఫంక్షన్ తీసుకుని, దానిని తమ సొంత కోడ్లా పుష్ చేస్తున్నారని అన్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు 'చాట్‌జీపీటీ' ద్వారా క్యాంపెయిన్ ఐడియాలు తీసుకుని, మీటింగ్‌లలో అవి తమ సొంత ఆలోచనలుగా బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే డేటా అనలిస్టులు, 'మిడ్‌జర్నీ' వాడే డిజైనర్లు, కస్టమర్ సపోర్ట్ లీడ్స్ సైతం తలుపులు వేసుకుని, బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేస్తూ రహస్యంగా AIతో పని పూర్తి చేసి తమ ప్రతిభగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
నిఘా కెమెరాలు దండగ.. అవుట్‌పుట్ చెప్తుంది నిజం!
ఆఫీసుల్లో ఉద్యోగులపై నిఘా కెమెరాలు లేదా గూఢచారులను పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, కంపెనీలకు వచ్చే ఫలితాలు, లెక్కలను బట్టి అసలు విషయం ఇట్టే అర్థమవుతుందని ఆర్జీవీ అన్నారు. AI రోజుకు 24 గంటలు పనిచేస్తుందని, దానికి కాఫీ బ్రేకులు, అనారోగ్య సెలవులు, జీతాల పెంపు లేదా ప్రమోషన్ల డిమాండ్లు ఉండవని గుర్తు చేశారు. అందువల్లే ఆఫీసుల్లో పని వేగం పెరిగి, డెడ్లైన్లు త్వరగా పూర్తవుతూ కంపెనీలకు లాభాలు వస్తున్నాయని విశ్లేషించారు. తీరా లేఆఫ్‌లు వచ్చినప్పుడు మాత్రం కంపెనీలను, టెక్నాలజీని నిందిస్తున్నారని, కానీ నిజానికి ఉద్యోగులే రహస్యంగా తమ స్థానాన్ని AIతో భర్తీ చేసుకుని జీతాలు తీసుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బహిరంగంగా AIని అంగీకరించడమే అసలైన మార్గం
ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ దొంగచాటు వ్యవహారాలు మానేసి, కృత్రిమ మేధస్సును బహిరంగంగా, ఎలాంటి అపరాధభావం లేకుండా అంగీకరించాల్సిన సమయం వచ్చిందని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏం జరిగినా ఒక విషయం మాత్రం ఖాయమని, AIని సమర్థవంతంగా ఉపయోగించే ఉద్యోగులే, దానిని వాడని వారి ఉద్యోగాలను భర్తీ చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. ఉద్యోగులు, సంస్థలు AI సహకారంతో కలిసి ముందుకు సాగితేనే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆర్జీవీ సూచించారు.

