వందల కోట్లు పెట్టి తీసే పాన్ ఇండియా సినిమాలకు అసలు ఏమవుతోంది? టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'రీషూట్స్' అనే పదం బడా నిర్మాతలకు వణుకు పుట్టిస్తూ, చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోంది.
[FEATURED_IMAGE]హీరోల జోక్యం.. మూడుసార్లు రీషూట్!
టాలీవుడ్‌లో బడా హీరోలు, బడా డైరెక్టర్ల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ, ఈమధ్య తెరకెక్కుతున్న పలు భారీ బడ్జెట్ చిత్రాలు షూటింగ్ దాదాపు పూర్తయిన తర్వాత కూడా పదే పదే రీషూట్లకు వెళ్లడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఓ స్టార్ హీరో సినిమా ఏకంగా మూడుసార్లు రీషూట్ జరుపుకుందనే వార్త ఫిల్మ్ నగర్‌ను కుదిపేస్తోంది. దర్శకుడు తీసిన సన్నివేశాలు హీరోకు నచ్చకపోవడం వల్లే, ఆయన పట్టుబట్టి మరీ ఇలా పదే పదే మార్పులు చేయిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అసలు లోపం కథలోనా.. ప్లానింగ్‌లోనా?
సినిమా అవుట్‌పుట్ సరిగ్గా రానప్పుడు, కథకు మరింత బలం చేకూర్చడానికి కొన్ని సన్నివేశాలు మళ్లీ తీయడంలో తప్పులేదు. కానీ, మాటిమాటికి సెట్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందనేదే ఇక్కడ వేసుకోవాల్సిన అసలు ప్రశ్న.
దర్శకుడు, హీరోల మధ్య సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కనీసం షూటింగ్ మొదలుపెట్టే ముందే పక్కాగా కథ, స్క్రిప్ట్, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోకుండా సెట్స్‌పైకి వెళ్లడం వల్లే ఇలాంటి గందరగోళం తలెత్తుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బలిపశువులవుతున్న చిన్న సినిమాలు!
ఈ రీషూట్ల వల్ల నిర్మాతలకు అక్షరాలా చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కో రోజు షూటింగ్‌కు ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, సెట్స్, ఇతర ఏర్పాట్ల పేరిట అదనంగా లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతోంది. దీంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోయి నిర్మాతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
ఇక ఈ రీషూట్ల వల్ల పెద్ద సినిమాల రిలీజ్ తేదీలు మారడం మరో పెద్ద తలనొప్పిగా మారింది. ఆ స్టార్ హీరోల సినిమాల డేట్స్ చూసుకుని ప్లాన్ చేసుకున్న చిన్న, మధ్యస్థాయి సినిమాలు తమ రిలీజ్‌లు మార్చుకోలేక తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో చిన్న నిర్మాతలు, పంపిణీదారులు సైతం ఇబ్బందుల పాలవుతున్నారు.
సినిమా అంటే కేవలం వందల కోట్లు కుమ్మరించడం, స్టార్‌డమ్ చూపించడం కాదు.. కచ్చితమైన ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్. హీరో, దర్శకుడు ఒకే విజన్‌తో ముందుకెళ్లినప్పుడే రీషూట్లకు చెక్ పడుతుంది. సినిమా నాణ్యతను పెంచాల్సిన రీషూట్లు.. కేవలం పంతాలకు పోయి చేస్తే భవిష్యత్తులో బడా నిర్మాతలను రోడ్డున పడేయడమే కాకుండా, చిన్న సినిమాల మనుగడనే ప్రశ్నార్థకం చేయడం గ్యారెంటీ!

