సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటబోతున్నారు. నవంబర్ 23న న్యూయార్క్‌లో జరగనున్న 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్‌గా పాల్గొననున్నారు. ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ వేదికపై అవార్డు ప్రదానం చేయనున్న తొలి భారతీయ నటుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించడం యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణంగా మారింది.
[FEATURED_IMAGE]వెండితెరపై ఆయనో స్టార్ హీరో, పాన్ ఇండియా విలన్.. కానీ బయట మాత్రం ఎంతో సాదాసీదాగా కనిపించే సాధారణ వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు అసలు సిసలైన ఉదాహరణ విజయ్ సేతుపతి. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన ఈ స్టార్.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ వేదికపై మన భారతీయ సినిమా రేంజ్ ఏంటో చాటిచెబుతున్నారు. తన సహజమైన నటనతో ఏ భాషలోనైనా ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే ఆయనకు ఇప్పుడు మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది.
ఎమ్మీ అవార్డ్స్‌లో తొలి ఇండియన్ యాక్టర్‌గా రికార్డ్
నవంబర్ 23న న్యూయార్క్ నగరంలో 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ టెలివిజన్, ఓటీటీ కంటెంట్‌ను సత్కరించే ఈ వేడుకలో విజయ్ సేతుపతి అవార్డులను అందించనున్నారు. ఒక భారతీయ నటుడికి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ఈ అవకాశం దక్కడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా స్వయంగా ఈ ప్రతిష్టాత్మక బాధ్యత కోసం ఆయన పేరును సూచించడం విశేషం. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా, ఆడంబరాలకు పోకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మక్కల్ సెల్వన్ ఎదుగుదలకు ఇది నిజమైన గుర్తింపు.
గతంలో 2016లో బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్' వేదికపై ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్స్టన్తో కలిసి అవార్డును అందించారు. అయితే 'ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్' కేటగిరీలో మాత్రం అవార్డులు ప్రదానం చేసే తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకోనున్నారు.
గ్లోబల్ రేంజ్లో ఇండియన్ సినిమా దమ్ము
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, కేవలం తన టాలెంట్‌ను నమ్ముకుని ఈ స్థాయికి చేరడం వెనుక ఉన్న కష్టం సామాన్యులకు సైతం ఎంతో స్ఫూర్తినిస్తుంది. 'మహారాజ' లాంటి చిత్రాలతో గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం మెప్పించిన విజయ్ సేతుపతి.. ఈ ఎమ్మీ అవార్డ్స్ వేదికపైకి అడుగుపెట్టడం ద్వారా భారతీయ నటీనటులకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు వచ్చేలా తలుపులు తెరుస్తున్నారు. రాబోయే రోజుల్లో మన దేశం నుంచి మరిన్ని గ్లోబల్ ప్రాజెక్టులు, టాలెంటెడ్ నటీనటులు ప్రపంచ వేదికలను శాసించడం ఖాయంగా కనిపిస్తోంది.

