తమన్నా 'ఓదెల 2' హిట్ టాక్! విలన్ వశిష్ఠ భార్య ఎవరో తెలుసా?

naveen
By -

తమన్నా కీలక పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓదెల 2’. గతంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ వంటి మాస్ సినిమాలను తీసిన దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించడం విశేషం. గత శుక్రవారం (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, శరత్ లోహితాశ్వ, యువ, నాగ మహేశ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లో కనిపించిన తమన్నా, ఈ సినిమాలో మొదటిసారి నాగ సాధువుగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. 

ఈ సినిమాలో తమన్నా తర్వాత హైలైట్‌గా నిలిచిన పాత్ర విలన్‌ది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలను అత్యాచారం చేసి చంపే ప్రేతాత్మ పాత్రలో టాలీవుడ్ నటుడు వశిష్ఠ ఎన్. సింహా అద్భుతంగా నటించాడు. తన గంభీరమైన గొంతుతో ప్రేక్షకులను భయపెట్టాడు. విలన్‌గా మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు వశిష్ఠ. కన్నడ నటుడైనప్పటికీ, తెలుగులో కూడా వశిష్ఠకు మంచి గుర్తింపు ఉంది. ‘కేజీఎఫ్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నటుడు, ‘నారప్ప’, ‘ఓదెల రైల్వే స్టేషన్’, ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’, ‘యేవమ్’, ‘సింబా’ వంటి తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

అన్నట్లు, వశిష్ఠ సతీమణి కూడా ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. న్యాచురల్ స్టార్ నాని, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె హరిప్రియ. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించకపోయినా, కన్నడ సినిమాల్లో మెరుస్తూనే ఉంది. ‘తకిత తకిట’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హరిప్రియ, నానితో ‘పిల్ల జమీందార్’లో పక్కింటి అమ్మాయిగా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, బాలకృష్ణతో ‘జై సింహా’ సినిమాల్లో నటించింది. 

హరిప్రియ, వశిష్ఠ సింహలది ప్రేమ వివాహం. 2023లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను ఆహ్వానించిన ఈ జంట, సంతోషంగా జీవిస్తోంది.