భక్తుల కొంగు బంగారం పూరీ జగన్నాథుడి ఆలయం వద్ద ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఎంతో పవిత్రంగా భావించే పూరీ శ్రీ మందిరం గోపురం జెండాకు సంబంధించిన ఒక ముక్కను ఒక గరుడ పక్షి ఎత్తుకెళ్లింది. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అది శ్రీ మందిరం గోపురంపై ఉండే జెండా గుడ్డ ముక్కనా కాదా అనే దానిపై స్పష్టత లేదు.
గుడ్డ ముక్కను నోటితో తీసుకెళ్లిన గరుడ పక్షి
గరుడ పక్షి ఒక గుడ్డ ముక్కను తన నోటితో కరుచుకున్న తర్వాత సముద్రం వైపు ఎగిరి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత అది ఆకాశంలోనే మాయమైంది. గరుడ పక్షి ఎత్తుకెళ్లిన ఆ గుడ్డ ముక్కపై ఆలయ అధికారులు ఇంకా స్పందించలేదు.
సమయం మరియు భక్తుల స్పందన
ఈ సంఘటన శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జెండా రహస్యం గురించి తెలిసిన భక్తులు ఇదంతా దేవుడి మహిమే అని భావిస్తున్నారు. ఆలయ అధికారులు స్పందిస్తేనే దీనిలో నిజం ఎంత ఉందో తెలుస్తుంది. ఇక, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘పరమ పవిత్రమైన ఆ జెండా ముక్కను గరుత్మంతుడు ఎత్తుకెళ్లాడు. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది’ అని కామెంట్ చేయగా, మరికొందరు ‘ఇదంతా దేవుడి లీల. ఆ గ్రద్ద జెండాను ఎత్తుకెళ్లి సముద్రం వైపు వెళ్లి మాయమైంది. అది కచ్చితంగా దేవుడి దగ్గరకు వెళ్లి ఉంటుంది’ అంటూ తమ నమ్మకాన్ని తెలియజేస్తున్నారు.
పూరీ జగన్నాథుడి ఆలయంలోని జెండా రహస్యం
పూరీ జగన్నాథుడి ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. వాటిలో గోపురంపై ఉండే జెండా రహస్యం కూడా ఒకటి. సాధారణంగా గాలి వీచిన దిశగా వస్తువులు కదులుతాయి. గుడ్డ ముక్క అయితే గాలి వీస్తున్న వైపు రెపరెపలాడుతుంది. కానీ, శ్రీ మందిరం గోపురం పైన ఉండే జెండా మాత్రం గాలి వీస్తున్న దిశకు వ్యతిరేకంగా రెపరెపలాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. భక్తులు దీనిని పూరీ జగన్నాథుడి లీలగా భావిస్తారు. ఈ జెండాను ‘పతితపావన బనా’ అని పిలుస్తారు. ఈ జెండాను ప్రతి రోజు మారుస్తూ ఉంటారు.
0 కామెంట్‌లు