పాకిస్థాన్ నుండి వస్తున్న ప్రమాదాలపై భారత భద్రతా వ్యవస్థ మరోసారి అప్రమత్తమైంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న పవిత్ర స్వర్ణ దేవాలయంపై దాడికి పాక్ కుట్ర పన్నినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ముందుగానే సమాచారం అందిన నేపథ్యంలో భారత సైన్యం సమర్థంగా స్పందించి ముప్పును తిప్పికొట్టింది.
వైమానిక దళ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సుమర్ ఇవాన్ ఈ ఘటనపై మాట్లాడుతూ, దేశంలో అస్థిరత సృష్టించాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ఆలయాలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని తాము ముందే ఊహించామన్నారు. నిఘా వర్గాల ద్వారా స్వర్ణ దేవాలయంపై పాక్ కుట్రలు గుర్తించిన వెంటనే అక్కడి యాజమాన్యం భారత సైన్యానికి పూర్తి సహకారం అందించిందని తెలిపారు.
ఆపరేషన్ సమయంలో గోప్యత పాటిస్తూ స్వర్ణ దేవాలయంలోని ముఖ్య లైట్లను ఆపివేసినట్టు, ఆ దేవాలయంలో ఆయుధాలతో సైనికులను మోహరించేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. “ఈ స్థాయిలో ఆలయ సహకారం చాలా అరుదైనదని, దీనికి వారు అర్థవంతంగా స్పందించినందుకు మేము కృతజ్ఞులం,” అని లెఫ్టినెంట్ జనరల్ అన్నారు.
ఇక మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వివరించిన ప్రకారం, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాక్ పరోక్షంగా ప్రతీకారం తీర్చుకునే యత్నం చేసినట్టు స్పష్టమవుతోంది. స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ అనేక డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినా భారత సైన్యం వాటిని సమర్థంగా అంతరించిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రయోగించిన వందలాది పాక్ మిసైల్‌లను S-400, ఆకాశ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుతంగా ఆపాయని తెలిపారు.
ఈ చర్యలన్నీ భారత భద్రతా వ్యవస్థ గట్టి సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు.