కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గతంలో ప్రపంచాన్ని గజగజలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఆసియా దేశాల్లో మరల రికార్డు స్థాయిలో కేసులను కలిగిస్తోంది. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి వారం వేలల్లో కొత్త కేసులు నమోదవుతుండగా, వ్యాధి తీవ్రత స్థూలంగా తగ్గినా, వ్యాప్తి వేగం ఆందోళనకరం అని అధికారులు చెబుతున్నారు.
సింగపూర్‌లో, ఏప్రిల్ చివరి వారం నాటికి 14,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారం 11,000 కేసుల చుట్టూ నమోదవడం వల్ల వైరస్ వ్యాప్తి తీవ్రత బయటపడింది. అయితే, ఐసీయూ చికిత్సలు చాలా తక్కువగా ఉన్నాయని స్థానిక ఆరోగ్యశాఖ పేర్కొంది.
థాయ్‌లాండ్‌లో, మే రెండవ వారంలోనే దాదాపు 33,000 కొవిడ్ కేసులు నమోదయ్యాయని అంచనా. ఇది ఒమిక్రాన్ వంశానికి చెందిన XBC వేరియంట్ ప్రభావమని చెబుతున్నారు. అలాగే హాంకాంగ్ లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
చైనా లో గత ఐదు వారాలుగా ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపు కావడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివిటీ రేటు 7.8% నుంచి 16% కు పెరగడం, హాస్పిటల్ అడ్మిషన్లు 6% కు చేరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి.
ఈ వ్యాప్తికి ప్రధాన కారణంగా JN.1 వేరియంట్ మరియు దాని ఉపవేరియంట్లు (LF.7, NB.1.8) ఉన్నాయని సింగపూర్ వైద్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం స్థానికంగా పరీక్షించిన కేసుల్లో అధికంగా ఈ వేరియంట్లే గుర్తించబడ్డాయి. తాజా టీకాలో JN.1 వేరియంట్‌ను చేర్చినట్లు తెలిపారు.
కేసుల పెరుగుదలకి వాతావరణ మార్పులు, పెరిగిన ప్రయాణాలు, సామూహిక కార్యక్రమాలు, ప్రజలలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కూడా ప్రభావితం చేస్తున్నాయని సింగపూర్ ఆరోగ్యశాఖ వివరించింది. హాంకాంగ్ అధికారులు కరోనా వైరస్‌ను ఇప్పుడు స్థానిక వ్యాధిగా గుర్తించామని పేర్కొన్నారు. అయితే JN.1 ‘Variant of Interest’ మాత్రమేనని, ఇది పెద్దగా ఆందోళన కలిగించదని WHO స్పష్టం చేసింది.