భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెటర్ల అభిమానుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనికి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారని, మిగతా క్రికెటర్లందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్స్ అని హర్భజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో హర్భజన్ వ్యాఖ్యలు
ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్-2025 తర్వాత ధోని రిటైర్ అయ్యే ఆలోచన లేదని, తన నిర్ణయాన్ని సీఎస్‌కే యాజమాన్యానికి తెలియజేశాడని శనివారం వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే హర్భజన్ తన మనసులోని మాటలను బయటపెట్టారు.
ధోనికే నిజమైన అభిమానులు: హర్భజన్
"ఎంఎస్ ధోని ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఐపీఎల్‌లో కొనసాగుతాడు. అతని భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే బాధ్యత నాకు ఉంటే, నేను కూడా ధోనిని కొనసాగించేవాడిని" అని హర్భజన్ వ్యాఖ్యానించారు."నా అభిప్రాయం ప్రకారం, ధోనికే మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారు. మిగిలిన క్రికెటర్ల అభిమానులు ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తారు. అందులో కూడా చాలామంది పెయిడ్ ఫ్యాన్స్. అటువంటి వారిపై చర్చ అవసరం లేదు, ఎందుకంటే అది విషయాన్ని తప్పుదోవ పడేస్తుంది" అంటూ హర్భజన్ క్రిక్‌బజ్ షోలో స్పష్టం చేశారు.
కోహ్లీ, రోహిత్ అభిమానుల ఆగ్రహం
హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంఎస్ ధోని దేశద్రోహి అంటూ ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నారు. "SHAME ON DESHDROHI DHONI" కీవర్డ్ ఎక్స్‌లో ట్రెండింగ్ లో ఉంది.