రాష్ట్ర భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్


ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా అప్రమత్తంగా సేవలు అందిస్తారో, రాష్ట్రంలో కూడా అంతర్గత భద్రతపై పోలీసులు సమాన స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలు ఉగ్రవాద లక్ష్యాలుగా మారుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖతో పాటు పాలనా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ లేఖ రాశానని గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

ఉగ్రవాద ముప్పుపై పవన్ ఆవేదన

హైదరాబాద్, కోయంబత్తూరు ఘటనలను గుర్తుచేసుకుంటూ, ఆ దుర్ఘటనలు ఇప్పటికీ తన మనసును కలచివేస్తాయని చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో పలు అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన నేపథ్యంలో, డీజీపీకి లేఖ రాసి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఉగ్రవాద సంబంధిత అనుమానితులపై సున్నితంగా కాకుండా, కఠినంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

వలసదారులు, తీర ప్రాంతాలపై నిఘా

వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కదలికలపై నిఘా వుండాలనీ, సముద్రతీర ప్రాంతాల్లో బహిరంగ మానవుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ సూచించారు. గతంలో కాకినాడ వద్ద బోట్లలో అనుమానితుల రాకపై వచ్చిన వార్తలపై స్పందిస్తూ, తీర ప్రాంతాల్లో 24/7 నిఘా తప్పనిసరి అని చెప్పారు.

నిఘా వ్యవస్థ పటిష్టతకు పిలుపు

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సంయుక్త పోలీస్ ఆపరేషన్‌లో వెల్లడైన తాజా సమాచారం మేరకు రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద కార్యకలాపాల సంకేతాలు లభించాయని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతా వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన అలసత్వం కూడా అంతర్గత భద్రతకు ప్రమాదంగా మారుతుందని హితవు పలికారు.