boycott turkey | భారతీయుల దెబ్బ: టర్కీ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు భారీ నష్టం


సరిహద్దుల్లో దాడులు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్‌కు మిత్రుడిగా మారి మనతో శత్రుత్వం వహించిన టర్కీకి ఇప్పుడు భారతీయులు తమ సత్తా చూపిస్తున్నారు. భారత్‌లో ‘బాయ్‌కాట్ టర్కీ’ నిరసనల ప్రభావం ఆ దేశంపై తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు భారతీయులు నిరాకరిస్తున్నారు. మనతో శత్రుత్వం పెట్టుకున్నందుకు వాణిజ్యం మరియు పర్యాటకం పరంగా టర్కీకి భారీ నష్టం వాటిల్లనుంది. అక్కడికి వెళ్లి వివాహాలు చేసుకునేందుకు భారతీయ కుబేరులు ఆసక్తి చూపడం లేదు. గత కొంతకాలంగా భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కేంద్రంగా ఉన్న టర్కీలో ఇప్పుడు పెళ్లి సందడి తగ్గిపోనుంది.

ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా పెరిగింది. ఇందులో టర్కీ ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. అక్కడి ఇస్తాంబుల్ రాజభవనాలు మరియు తీర ప్రాంతాలు కాబోయే జంటలను ఆకర్షించడంతో గత కొన్నేళ్లుగా భారత్ నుండి ఆ దేశానికి వెళ్లి పెళ్లి చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు బాయ్‌కాట్ టర్కీ నినాదంతో ఆ దేశానికి జరిగే నష్టం ఎంతో చూద్దాం...

2018లో టర్కీలో 18 భారతీయ జంటలు వివాహం చేసుకున్నారు. 2024లో ఈ సంఖ్య 50కి చేరుకుంది. ఒక్కో పెళ్లికి సగటు ఖర్చు 3 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 25 కోట్లు. ఇటీవల పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ టర్కీ అతిగా స్పందించడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెళ్లిళ్ల కోసం ఆ ప్రదేశాన్ని కాకుండా వేరే చోటు వెతుక్కుంటున్నారు. దీనివల్ల టర్కీకి ఏడాదికి 90 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనుంది. అంతేకాకుండా అతిథుల స్థానిక పర్యటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా టర్కీ కోల్పోనుంది.

సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. దీంతో భారత్‌లోని అన్ని వర్గాల ప్రజలు టర్కీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నెమ్మదిగా తెంచుకుంటున్నారు. ఇప్పటికే పండ్ల వ్యాపారులు మరియు ఆభరణాల వర్తకులు టర్కీ నుండి దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దేశ కంపెనీలతో సంబంధాలు వద్దని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య నిర్ణయించింది. భారతీయుల చర్యలతో టర్కీ ఇబ్బంది పడుతోంది.