పాకిస్తాన్ అణు సామర్థ్య బ్లాక్‌మెయిలింగ్‌ను ఇక సహించేది లేదని, అణుశక్తి మరియు అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 'ఆపరేషన్ సింధూర్' పై జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
పాకిస్తాన్ నుండి ప్రయోగించిన డ్రోన్లు మరియు మిస్సైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందని మోదీ తెలిపారు. భారత మిస్సైళ్లు పాక్ రక్షణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశాయని, పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు మరియు రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు మరియు రాడార్ స్టేషన్‌లలో భారత మిస్సైళ్లు విధ్వంసం సృష్టించి, పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించిందని మోదీ అన్నారు.
పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందని మోదీ అన్నారు. భారత్ ప్రతిచర్యలకు బెంబేలెత్తిన పాక్, కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని ఆయన తెలిపారు. భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు మరియు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టంగా చెప్పాయని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయని, భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు ఉంటాయని మోదీ స్పష్టం చేశారు.

