పాకిస్తాన్‌తో చర్చలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మరియు ఉగ్రవాదంపైనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జాతిని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని అన్నారు.
ఉగ్రవాదం మరియు చర్చలు, ఉగ్రవాదం మరియు వాణిజ్యం, ఉగ్రవాదం మరియు నీటి పంపిణీ ఏకకాలంలో ఉండవని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో చర్చలంటే ఉగ్రవాదంపైనే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే అని, ఈ రెండు అంశాలు తప్ప మరే ఇతర అంశాలపై చర్చలు ఉండవని మోదీ తేల్చి చెప్పారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందని మోదీ అన్నారు. 'ఆపరేషన్ సింధూర్' ద్వారా భారత రక్షణ దళాల సామర్థ్యం ఏమిటో పాకిస్తాన్ రుచి చూసిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవరినీ భారత్ ఉపేక్షించదని మోదీ స్పష్టం చేశారు.
సాంకేతిక యుద్ధంలో భారత్ పరిణితి మరియు ఆయుధ సంపత్తిని ప్రదర్శించిందని, మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో, ఎంత శక్తివంతమైనవో భారత్ చూపించిందని ఆయన అన్నారు. ఈ యుగం యుద్ధాలది కాదని, ఉగ్రవాదానిది అంతకంటే కాదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకైనా, దాడులకైనా భారత్ వెనుకాడదని మోదీ స్పష్టం చేశారు.

