థగ్ లైఫ్ లిప్‌లాక్ వివాదం: అభిరామి క్లారిటీ! అది కేవలం 3 సెకన్ల సీన్ మాత్రమే...

 


కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, ట్రైలర్‌లోని మూడు సెకన్ల నిడివి గల ఒక సన్నివేశం పెద్ద చర్చకు దారితీసింది. 70 ఏళ్ల కమల్ హాసన్, 42 ఏళ్ల నటి అభిరామి మధ్య ఉన్న లిప్‌లాక్ సన్నివేశాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో, నటి అభిరామి తొలిసారిగా ఒక జాతీయ వార్తా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది. 'థగ్ లైఫ్' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న అభిరామి, ఆ వివాదాస్పద సీన్ గురించి ఇలా చెప్పుకొచ్చింది:

"ఈ రోజుల్లో ఏదైనా క్షణాల్లోనే వివాదంగా మారవచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేము. దర్శకులు మణిరత్నం సార్ నన్ను ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో నేను ఆయన్ను ప్రశ్నించను. సినిమా విషయంలో వారి నిర్ణయం ఏదైనా సరే నేను దానిని అంగీకరిస్తున్నాను. పూర్తి నా ఇష్టంతోనే ఆ సీన్ తీశారు. ఇది కేవలం మూడు సెకన్ల దృశ్యం. కానీ, ట్రైలర్ వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి."

"సినిమాలోని ఆ సన్నివేశంతోనూ, లిప్‌లాక్‌కు దారితీసే విషయాలతోనూ చాలా లింక్ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్లు చేయరని నేను అనుకుంటున్నాను. అది ఆ సన్నివేశానికి బాగా సరిపోతుందనే చేశాం. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... వారు ముందు సినిమా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను" అని అభిరామి అన్నారు.

'థగ్ లైఫ్' విశేషాలు:

కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్న ఈ 'థగ్ లైఫ్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ మొత్తం హై-యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అభిరామితో పాటు శింబు, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, నాసర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి వంటి భారీ తారాగణం నటించింది.

ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా నిర్మించారు. 'థగ్ లైఫ్' సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.