పిల్లలు మట్టి, జుట్టు తింటున్నారా? జాగ్రత్త! జైపూర్‌లో షాకింగ్ కేసు: కడుపులోంచి 7 అడుగుల జుట్టు ఉండ తొలగింపు!

 


మీ పిల్లలు కూడా మట్టి, సుద్ద, దారం, చెక్క ముక్కలు నమలడం లేదా తినడం చేస్తుంటే అప్రమత్తంగా ఉండండి. జైపూర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడ 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కడుపులోంచి ఏకంగా 210 సెంటీమీటర్ల (సుమారు 7 అడుగులు) పొడవున్న జుట్టు ఉండ (ట్రైకో బెజోవర్)ను వైద్యులు విజయవంతంగా తొలగించారు.

కడుపు నొప్పితో బాధపడుతున్న తన కుమార్తెను తల్లిదండ్రులు జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ విద్యార్థినిని పరీక్షించిన వైద్యులు కడుపులో ఒక పెద్ద ముద్ద ఉందని కనుగొని షాక్ అయ్యారు. అది బొడ్డు చుట్టూ వ్యాపించి ఉండటంతో, వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.

నెలల తరబడి సమస్య, చివరకు వైద్యులు షాక్:

ఈ సంఘటన జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థిని చాలా కాలంగా కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చాలా చోట్ల చికిత్స చేయించినా, కొద్దిరోజులు ఉపశమనం లభించి మళ్లీ సమస్య మొదటికొచ్చేది. చివరకు, ఒకరి సలహా మేరకు విద్యార్థినిని సవాయి మాన్సింగ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, ఆమె కడుపులో ఒక పెద్ద ముద్ద ఉన్నట్లు గుర్తించారు. అది బొడ్డు చుట్టూ విస్తరించి ఉంది. తదుపరి పరీక్షలు నిర్వహించిన తర్వాత, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు.

2 గంటల పాటు శస్త్రచికిత్స: వైద్యుల సాహసం!

CE CT స్కాన్‌లో విద్యార్థిని కడుపు ఉబ్బిందని, దాని లోపల ఏదో అసాధారణ వస్తువు ఉందని స్పష్టంగా వెల్లడైంది. వెంటనే లాపరోటమీ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో, ఆశ్చర్యకరంగా విద్యార్థినికి రక్త మార్పిడి అవసరం పడలేదు. ఆపరేషన్ చేస్తుండగా వైద్యులు మరింత ఆశ్చర్యపోయారు.

గ్యాస్ట్రోస్టమీ (కడుపును తెరిచే ప్రక్రియ) సమయంలో, కడుపులోని ట్రైకోబెజోవర్ (జుట్టు ఉండ) కేవలం కడుపుకే పరిమితం కాలేదు. ఆ జుట్టు ఉండ చిన్న ప్రేగులలోకి కూడా వ్యాపించి ఉందని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స సమయంలో ఆ జుట్టు ఉండను ఒక్క ముక్కగా బయటకు తీయడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే, అది కట్ అయితే, దానిని తొలగించడానికి ప్రేగులను కూడా కట్ చేయాల్సి వచ్చేది. రెండు గంటల పాటు అపారమైన నైపుణ్యంతో శ్రమించి, వైద్యులు ఆ వెంట్రుకల ఉండ ఎక్కడా కట్ అవ్వకుండా తొలగించడంలో విజయం సాధించారు.

ఈ ఆపరేషన్‌లో డాక్టర్ కంకారియా బృందంలో డాక్టర్ రాజేంద్ర బుగాలియా, డాక్టర్ దేవేంద్ర సైని, డాక్టర్ అమిత్, డాక్టర్ సునీల్ చౌహాన్ తో పాటు అనస్థీషియా బృందం కూడా ఉంది. సహాయక సిబ్బంది షయీర్, జుగన్ కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అసలు కారణం: మానసిక సమస్య!

విద్యార్థినికి శస్త్రచికిత్స చేసిన సర్జన్ డాక్టర్ జీవన్ కంకారియా మాట్లాడుతూ, ఆ విద్యార్థిని మానసిక సమస్యతో బాధపడుతోందని తెలిపారు. ఈ సమస్య కారణంగా ఆమె కనిపించిన ప్రతిదీ తినడం మొదలుపెట్టింది. బంకమట్టి, సుద్ద ముక్కలు, దారం, చెక్క ముక్కలు, జుట్టు ఇలా ఏది కనిపిస్తే అది తినేసేది. ఇవన్నీ ఆమె కడుపులో పేరుకుపోయాయి. క్రమంగా దారం, జుట్టు.. ఇతర వస్తువులు కలిసి ఒక పెద్ద ముడి రూపాన్ని తీసుకున్నాయి. ఆ తరువాతే కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు వంటి సమస్యలు మొదలయ్యాయని డాక్టర్ జీవన్ కంకారియా వివరించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి విచిత్రమైన వస్తువులను తింటున్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.