స్పిరిట్ నుంచి దీపికా పదుకొణే ఎందుకు తప్పుకుంది? అసలు కారణం ఇదే!

 


గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణే పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆమె ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించనున్న 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకోవడమే. దీపిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగానే, ఆ స్థానంలో తృప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించనున్నట్లు సందీప్ రెడ్డి వంగా వెంటనే ప్రకటించారు. ఆ తర్వాత దీపికా విషయంలో బాగా హర్ట్ అయిన సందీప్, తన సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో దీపికా కూడా తన సోషల్ మీడియాలో మహిళలపై వివక్ష గురించి ఒక వీడియోను షేర్ చేసింది. దీపిక పోస్ట్ చేసిన ఈ వీడియోను తమన్నా భాటియా లైక్ చేసి మద్దతు తెలపడంతో, ఈ మొత్తం వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అసలు దీపిక 'స్పిరిట్' నుంచి తప్పుకోవడానికి పలు కారణాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

నెట్టింట ప్రచారంలో ఉన్న కారణాలు:

'స్పిరిట్' సినిమా కోసం దీపికా రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేయనని స్పష్టం చేసిందని, ఈ విషయంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి కోపం వచ్చి ఆమెను తప్పించినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, షూటింగ్ 100 రోజులకు మించితే, అదనపు రోజులకు అదనపు పారితోషికం ఇవ్వాలని దీపిక డిమాండ్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ షరతులు సందీప్ రెడ్డి వంగాకు ఇబ్బంది కలిగించాయని అప్పట్లో చెప్పుకున్నారు.

అసలు కారణం బయటపెట్టిన దీపిక:

అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపికా పదుకొణే స్వయంగా 'స్పిరిట్' సినిమా నుండి తప్పుకోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించింది. "రీసెంట్‌గా ఒక డైరెక్టర్ నన్ను కలిశారు. కథ చాలా బాగా నచ్చింది. కానీ, రెమ్యూనరేషన్ గురించి చర్చ వచ్చినప్పుడు, నేను ఇంత ఛార్జ్ చేస్తానని చెప్పాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను వారికి టాటా బైబై చెప్పాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదు" అని దీపికా స్పష్టం చేసింది.

ప్రస్తుతం దీపికా పదుకొణే అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా రాబోయే సినిమాలో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇటీవలే దీపిక 'కల్కి 2898 AD' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.