స్టూడెంట్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందా నడిపాడు. కానీ పోలీసులు అతన్ని జైల్లో పెట్టలేదు.. ఏకంగా విమానం ఎక్కించి సొంత దేశానికి పంపించేశారు!
అవును.. మీరు చదివింది వాస్తవమే. ఫోన్ చేస్తే చాలు.. ఇంటికే కొకైన్ చేరవేసే నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లర్ 28 ఏళ్ల విక్టర్ ఆటలకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. డ్రగ్ స్మగ్లర్‌గా వివిధ కేసుల్లో హస్తం ఉన్న అతడ్ని, తాజాగా అతడి దేశానికి డిపోర్ట్ (Deport) చేశారు.
స్టూడెంట్ వీసా.. డ్రగ్స్ దందా!
విక్టర్ విషయానికి వస్తే.. నాలుగేళ్ల క్రితం నైజీరియాకు చెందిన విక్టర్ స్టూడెంట్ వీసా మీద బెంగళూరులోని నోబెల్ కాలేజీలో చేరాడు. బీసీఏ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే డ్రగ్స్ సరఫరాదారుగా మారాడు.
నైజీరియాలోని కింగ్ పిన్ నుంచి వచ్చిన సందేశాలకు తగ్గట్లు, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని పెడ్లర్లకు 50 నుంచి 100 గ్రాముల కొకైన్ చేరవేసేవాడు. ఆ కమీషన్ సొమ్ములతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
హెచ్-న్యూ ఆపరేషన్.. పాస్‌పోర్ట్ ట్విస్ట్!
ఇతడి ఆటకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు చెక్ పెట్టారు. బెంగళూరు కేంద్రంగా చేసుకొని హైదరాబాద్‌లోని 50 మందికి కొకైన్ చేరవేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఇటీవల హైదరాబాద్ వచ్చిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఆశ్చర్యకరంగా, అతడి వీసా ముగిసినప్పటికీ.. కొద్ది రోజుల క్రితమే పాస్‌పోర్టు గడువును 2028 జులై వరకు పొడిగించుకున్నట్లుగా గుర్తించారు.
శిక్ష ఏది? అల్లుడిలా పంపించేశారు!
సరైన పత్రాలు లేకపోవడం, అక్రమంగా నివాసం ఉండటం, పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో అతడ్ని నైజీరియాకు డిపోర్ట్ చేశారు. డ్రగ్స్ దందా చేసే వారిని గుర్తించి, వారి దేశాలకు డిపోర్టు చేయడం దౌత్యసంబంధమైన అంశం కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఇది శిక్షా? లేక పర్యటనా?
అయితే, ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసే వారిపై కఠిన శిక్షలు విధిస్తేనే కొత్తవారు ఈ దందాలోకి అడుగు పెట్టేందుకు భయపడతారు. అందుకు భిన్నంగా, "అత్తారింటికి అల్లుడ్ని పంపినట్లుగా" డ్రగ్స్ దందా చేసే విదేశీయుల్ని విమానం ఎక్కించి వారి దేశానికి పంపించటం వల్ల డ్రగ్స్ దందాకు చెక్ పెట్టలేమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చట్టంలోని వెసులుబాటును పాలకులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

