KTR Fire on HYDRA: హైడ్రాకు పేదల ఇళ్లే కనిపిస్తాయా? పెద్దల భవనాలు కనపడవా?

naveen
By -

 

KTR Fire on HYDRA

హైడ్రాకు పేదల ఇళ్లే కనిపిస్తాయా? పెద్దలవి కావా?: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా (HYDRA) కేవలం పేదల ఇళ్లను ఎందుకు కూల్చుతుందో సమాధానం చెప్పాలని, పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు (ఆదివారం) తెలంగాణ భవన్‌లో హైడ్రా కూల్చివేతలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక 'హైడ్రా ఎగ్జిబిషన్' కార్యక్రమంలో కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?

పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అన్నట్లుగా ఈ ప్రభుత్వ పాలన ఉందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో తాము లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించామని, కానీ ఈ ప్రభుత్వంలో కేవలం కూలగొట్టే పనులే జరుగుతున్నాయని మండిపడ్డారు. యూపీలో బుల్డోజర్‌ను అడ్డుకుంటానన్న రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదల ఇళ్లు కూలుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క చెప్పిన బిల్డర్లపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ విమర్శించారు.


మీ వాళ్లను కాపాడుకోవడానికేనా?

బాధితులకు సమయం ఇస్తే కోర్టుకు వెళతారని హైడ్రా కమిషనర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరీకెపూడి గాంధీ భూమి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే అధికారులు స్వయంగా ఆయన భూమికి ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.


ముఖ్యమంత్రి సోదరుడు దుర్గం చెరువు దగ్గర FTLలో ఇల్లు కట్టినా, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వివేక్ కట్టిన ఇళ్లను ముట్టుకోవడం లేదని విమర్శించారు. మూసీ నీళ్లను అడ్డుకుంటూ కడుతున్న పెద్ద ప్రాజెక్టుల జోలికి వెళ్లడం లేదని, వారి దగ్గర డబ్బులు లాగడానికే హైడ్రాను ప్రభుత్వం వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.


బాధితులకు బీఆర్ఎస్ అండ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, సీఎం అయ్యాక స్వయంగా పేదల ఇళ్లను కూల్చడంపైనే దృష్టి పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చడమేనా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన పలువురు బాధితులతో కేటీఆర్ మాట్లాడారు. "ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, దిగిన తర్వాత బోడ మల్లన్న చందంగా ఈ ప్రభుత్వం ఉంది. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం" అని కేటీఆర్ బాధితులకు హామీ ఇచ్చారు.



హైడ్రా కూల్చివేతల అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. కేటీఆర్ చేసిన ఆరోపణలు, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. పేదలు, పెద్దల విషయంలో ప్రభుత్వం రెండు రకాల న్యాయం పాటిస్తోందన్న విమర్శలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లలో పంచుకోండి.


Tags: