పోలీసులే షాక్ అయ్యారు! ఓ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలను చూసి, వాటిని లెక్కపెట్టలేక మిషన్లు తెప్పించాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రతాపనగర్‌లో ఓ డ్రగ్స్ స్మగ్లర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. పోలీసులు దాడి చేసిన సమయంలో దొరికిన డబ్బును చూసి వారు షాక్ అయ్యారు.
భర్త జైల్లో.. భార్య గ్యాంగ్ లీడర్!
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతాపనగర్‌కు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే, అతను లేకపోయినా, అతని భార్య రీనా మిశ్రా గ్యాంగ్ నాయకురాలిగా మారి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతోంది.
కుటుంబం అంతా.. డ్రగ్స్ దందాలో!
ఈ దందాకు ఆమె కొడుకు వినాయక్ (19), కూతురు కోమలి (20), మేనల్లుళ్లు యశ్ (19), అజిత్ (31) సహకరిస్తున్నారు. ఈ పక్కా సమాచారంతో పోలీసులు రాజేశ్ మిశ్రా ఇంటిపై దాడి చేసి, రీనా మిశ్రాతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
4 కౌంటింగ్ మిషన్లు.. రూ. 2 కోట్ల క్యాష్!
ఇంటిపై దాడి చేసిన క్రమంలో, పోలీసులకు భారీ మొత్తంలో నోట్ల కట్టలు దొరికాయి. ఇందులో ఎక్కువగా 100, 50, 20 రూపాయల నోట్లే ఉన్నాయి. వాటిని చేతితో లెక్కపెట్టడానికి ప్రయత్నించిన పోలీసులకు చుక్కలు కనిపించాయి.
లెక్కపెట్టలేక, ఏకంగా నాలుగు కౌంటింగ్ మిషన్లు తెప్పించారు. చివరకు లెక్కించిన మొత్తం డబ్బు రూ. 2 కోట్ల 2 లక్షలు అని పోలీసులు వెల్లడించారు.
కోటి రూపాయల విలువైన డ్రగ్స్
డబ్బుతో పాటు, సుమారు కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 6.076 కేజీల గంజా, 577 గ్రాముల హెరాయిన్ ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ నోట్ల కట్టలను లెక్కపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త జైల్లో ఉన్నా, భార్య ఏమాత్రం భయం లేకుండా కుటుంబాన్నే రంగంలోకి దించి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం పోలీసులను విస్మయానికి గురిచేసింది.

