అమెరికా వెళ్లాలనుకునేవారికి ఇది పెద్ద షాక్! మీ వీసా దరఖాస్తు ఇప్పుడు కేవలం మీ పేపర్ల మీదే కాదు, మీ ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంది.
వలసదారులకు స్వర్గధామంగా ఉన్న అమెరికా ఇప్పుడు విదేశీయులపై వరుస ఆంక్షలు విధిస్తోంది. H1B వీసాలపై ఆంక్షలు విధించిన తర్వాత, ఇప్పుడు ఇతర వీసాలపై కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వీసాలు జారీ చేయకూడదని నిర్ణయించింది.
ఆరోగ్య సమస్యలుంటే వీసా రిజెక్ట్!
అమెరికా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, మధుమేహం (Diabetes), ఊబకాయం (Obesity), గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విదేశీ పౌరులకు వీసాలు జారీ చేయకూడదని నిర్ణయించారు. ఈ కొత్త మార్గదర్శకాలను వివిధ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలకు పంపించారు.
ఎందుకీ కఠిన నిర్ణయం?
అమెరికా ప్రభుత్వం తన నివాసితుల ఆరోగ్య సంరక్షణ కోసం, సబ్సిడీతో కూడిన బీమా పథకాల కోసం ఏటా భారీగా డబ్బు ఖర్చు చేస్తుంది. ప్రజల ఆరోగ్య సమస్యలు పెరిగితే, ప్రభుత్వంపై ఈ ఖర్చు భారం మరింత పెరుగుతుంది. ఈ కారణంగానే, అనారోగ్యంతో ఉన్న వలసదారులను దేశంలోకి రానివ్వకుండా కట్టడి చేయాలని అమెరికా నిర్ణయించుకుని ఉండవచ్చు.
గతంలో వేరు.. ఇప్పుడు వేరు!
నిజానికి, అమెరికా వీసా అభ్యర్థులు ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలనేది పాత నియమమే. అయితే, గతంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను విస్మరించి వీసా మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు మార్గదర్శకాలలో ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. దీంతో, ఎంబసీ అధికారులు దరఖాస్తుదారుడి ఆరోగ్య సమస్యను తీవ్రంగా పరిగణించి, వీసా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
లిస్ట్‌లో ఉన్న వ్యాధులు ఇవే..
"దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని మీరు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మధుమేహం, న్యూరోపతి, మానసిక ఆరోగ్యం వంటి సమస్యలు ఉన్నవారికి వేల డాలర్లు ఖర్చవుతాయి. ఊబకాయం వల్ల ఉబ్బసం, బీపీ వంటి ఇతర వ్యాధులు వస్తాయి. కాబట్టి దానిని కూడా తనిఖీ చేయండి" అని కొత్త యూఎస్ వీసా మార్గదర్శకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఈ కొత్త నిబంధనలతో, అమెరికా వీసా పొందాలనుకునే వారు తమ ఆర్థిక పత్రాలతో పాటు, ఆరోగ్య నివేదికల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

