రైలు ప్రయాణం అంటే మనకు గుర్తొచ్చేది కిటికీ పక్క సీటు, బయట కనిపించే ప్రకృతి అందాలు. కానీ రాత్రి ప్రయాణం అనగానే గుర్తొచ్చే మరో విషయం రైల్వే వారు ఇచ్చే దుప్పట్లు. సాధారణంగా ఏసీ బోగీల్లో ఇచ్చే దుప్పట్లపై చాలా ఫిర్యాదులు ఉంటాయి. అవి ఉతికినవో లేక వేరే వాళ్లు వాడినవో తెలియక, వచ్చే దుర్వాసన భరించలేక చాలామంది సొంత దుప్పట్లు తీసుకెళ్తుంటారు.
అయితే ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన 'వందే భారత్ స్లీపర్' రైలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిందని చెప్పవచ్చు. తాజాగా ఓ ప్రయాణికుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రయాణికుడి వీడియో - సీల్డ్ ప్యాకెట్లలో దుప్పట్లు:
హౌరా నుంచి కామాఖ్య (గౌహతి) వెళ్లే వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించిన సుకాంత్ షా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో అతను రైల్వే వారు అందించిన బెడ్డింగ్ కిట్ చూసి ఆశ్చర్యపోయారు. సాధారణ రైళ్లలో మాదిరిగా కాకుండా, ఇక్కడ సీల్డ్ ప్యాకెట్లలో దుప్పట్లను అందిస్తున్నారు.
ఆ ప్రయాణికుడు వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం, బ్లాంకెట్ కవర్ పై ఒక సీల్ వేసి ఉంది. అందులో అది పూర్తిగా శుభ్రం చేయబడిందని, శానిటైజ్ చేయబడిందని స్పష్టంగా రాసి ఉంది.
విమాన ప్రయాణ అనుభవం:
ప్రయాణికుడు ఆ ప్యాకెట్ విప్పి చూపిస్తూ, ఇది చాలా తాజాగా ఉందని, ఎలాంటి దుర్వాసన రావడం లేదని కితాబిచ్చాడు. దుప్పటి నీలం-ఆకుపచ్చ డిజైన్ తో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, దానిపై నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) లోగో కూడా ఉంది. ఇది 'ప్రీమియం లినెన్ కిట్'లో భాగంగా వస్తోందని, ఇందులో కవర్‌తో కూడిన దిండు, బెడ్‌షీట్ మరియు హ్యాండ్ టవల్ కూడా ఉన్నాయని వివరించారు.
దుప్పటి కవర్లు తొలగించి ఉతకడానికి వీలుగా ఉండటం వల్ల ప్రతి ప్రయాణికుడికి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందని అతను పేర్కొన్నారు. విమానాల్లో లభించే స్థాయి నాణ్యతను రైల్వేలో చూడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంలో వందే భారత్ స్లీపర్ ఒక ముందడుగు వేసింది. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ప్రయాణికులకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఇలా సీల్డ్ మరియు శానిటైజ్డ్ బ్లాంకెట్స్ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో అన్ని రైళ్లలోనూ ఇలాంటి ప్రమాణాలు పాటిస్తే సామాన్యుడి రైలు ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది.

