సోషల్ మీడియాలో నోరు జారితే ఏమవుతుంది? చట్టం, ప్రజాగ్రహం ఒక రేంజ్‌లో బుద్ధి చెబుతాయి. కానీ, తప్పు తెలుసుకుని సైలెంట్ అవ్వాల్సింది పోయి.. "నా అకౌంట్ పోతే నాకేంటి.. నెలకు యూట్యూబ్ ద్వారా రూ.8 లక్షలు సంపాదిస్తున్నా" అని ఒక యూట్యూబర్ అహంకారంతో మాట్లాడితే? హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ 'నా అన్వేషణ' అన్వేష్ (Naa Anveshana Anvesh) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్యాన్ అయింది. దీనిపై అతడు స్పందించిన తీరు, వాడిన భాష ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. అసలు అన్వేష్ ఏమన్నాడు? "బత్తాయిలు" అంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు?
రూపాయి రాని ఇన్‌స్టా పోతే నాకేంటి?
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడంపై అన్వేష్ ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. "నేను చాలా బాధ పడుతున్నానని అనుకున్నారా? రూపాయి రాని ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఏంటి.. పోతే ఏంటి? నా ఈక" అంటూ అత్యంత అహంకారపూరితంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.
తనకు సోషల్ మీడియా ఖాతాలు రెండు చేతులు, కాళ్ల లాంటివని, బాడీ ఫేస్ బుక్ అని చెప్పుకొచ్చాడు. వాటన్నింటిని నడిపించే తన 'బుర్ర' (తల) పోయే వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని సవాల్ విసిరాడు. చేతులు, కాళ్లు, బాడీ పోయినా.. తలతో మాట్లాడుకుంటూ పోతానని, తన ఫాలోవర్లు పోయినా తనకు నష్టం లేదని తేల్చిచెప్పాడు.
నెలకి రూ.8 లక్షల ఆదాయం.. బత్తాయిలకు వార్నింగ్!
తన ఖాతాను బ్యాన్ చేయించిన వారిని 'బత్తాయిలు' అంటూ అన్వేష్ పరోక్షంగా టార్గెట్ చేశాడు. వినాయకుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, 2026లో వాళ్లను క్షమించేదే లేదని, నిద్రపోనివ్వనని బెదిరింపులకు దిగాడు.
ఇదే క్రమంలో తన ఆదాయాన్ని సైతం అన్వేష్ గర్వంగా బయటపెట్టాడు. తనకు ఇన్‌స్టాతో పనిలేదని, యూట్యూబ్ ద్వారా నెలకు రూ.8 లక్షలు, బ్యాంక్ వడ్డీ ద్వారా మరో లక్ష రూపాయలు వస్తున్నాయని.. ఆ డబ్బే తనకు లాభం అని ధీమా వ్యక్తం చేశాడు.
అసలు ఈ వివాదం ఎలా మొదలైంది?
'నా అన్వేషణ' పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే అన్వేష్.. ఇటీవల హిందూ దేవుళ్లపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఈ వివాదం ముదిరిపోవడంతో.. అతని ఇన్‌స్టా ఖాతాకు నెటిజన్ల నుంచి మాస్ రిపోర్ట్స్ వెళ్లాయి. దీంతో ఫాలోవర్ల సంఖ్య 1.8 మిలియన్ల నుంచి 1.3 మిలియన్లకు పడిపోయింది. చివరికి ఆ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ శాశ్వతంగా బ్యాన్ చేసింది.
అహంకారం ఎప్పటికీ అలంకారం కాదు!
నెలకు లక్షలు సంపాదిస్తున్నానన్న పొగరు ఈరోజు అన్వేష్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, సోషల్ మీడియా అనేది ఎవరికీ సొంత జాగీరు కాదు. ఏ ప్రజల ఆదరణతో పైకి ఎదిగాడో.. అదే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే, రేపు ఆ రూ.8 లక్షలు ఇచ్చే యూట్యూబ్ కూడా బ్యాన్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఇది హద్దులు దాటి మాట్లాడే ప్రతి యూట్యూబర్‌కూ ఒక హెచ్చరికే!

