ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లలోకి వస్తే పరిస్థితి ఏంటి? అభిమానులకు డబుల్ ట్రీట్ అయినా.. నిర్మాతలకు, బయ్యర్లకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కలెక్షన్లు చీలిపోయి, ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అరుదైన, క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొన్నారు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఫిబ్రవరి 27న 'మృత్యుంజయ', 28న 'విష్ణు విన్యాసం' రిలీజ్ అంటూ ప్రకటనలు రావడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరిగింది. అయితే, ఈ కన్ఫ్యూజన్‌కు తెరదించుతూ శ్రీవిష్ణు స్వయంగా ఓ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.
రిలీజ్ డేట్స్ పై నెలకొన్న సందిగ్ధతకు చెక్
వరుసగా రెండు రోజులు తన సినిమాలు విడుదల కావడం లేదని శ్రీవిష్ణు స్పష్టం చేశారు. బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య పోటీ లేకుండా, తగిన గ్యాప్‌తో వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు తుది నిర్ణయానికి వచ్చారట.
ఈ రెండు సినిమాల క్లాష్‌ను నివారించగలిగినందుకు తనకు చాలా రిలాక్స్‌డ్‌గా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రెండు వేర్వేరు జానర్లలో వస్తున్న ఈ చిత్రాలకు సరైన గుర్తింపు దక్కాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు.
ముందు 'విష్ణు విన్యాసం'.. తర్వాత 'మృత్యుంజయ'
కొత్త ప్లాన్ ప్రకారం.. ఫిబ్రవరి 28న 'విష్ణు విన్యాసం' (Vishnu Vinyasam) ముందుగా థియేటర్లలో సందడి చేయనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'మృత్యుంజయ' (Mrithyunjay) మూవీ వాయిదా పడింది. దీనికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
సెన్సార్ బోర్డుతో టైటిల్ వివాదం ఉందా?
ఇటీవల కాలంలో దేవుళ్ల పేర్లు ఉన్న సినిమా టైటిల్స్‌పై సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 'హే భగవాన్' అనే టైటిల్‌ను 'హే బలవంత్'గా మార్చిన విషయం తెలిసిందే. దీంతో 'విష్ణు విన్యాసం' టైటిల్‌పై కూడా ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ రూమర్లను శ్రీవిష్ణు కొట్టిపారేశారు. తమ సినిమా టైటిల్‌కు సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే టీజర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, టైటిల్ మార్చాల్సిన అవసరం తమకు రాలేదని స్పష్టం చేశారు.
కంటెంట్ ఉన్నోడికి క్లాష్ ఎందుకు?
శ్రీవిష్ణు తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం కరెక్ట్. ఒకేసారి రెండు సినిమాలు వదిలి కలెక్షన్లు డ్యామేజ్ చేసుకునే కంటే, గ్యాప్ ఇచ్చి రెండు హిట్లు కొట్టడమే అసలైన ఇంటెలిజెన్స్. ముందుగా రాబోతున్న విష్ణు విన్యాసంతో హిట్ ట్రాక్ ఎక్కితే.. మృత్యుంజయకు ఆటోమేటిక్‌గా హైప్ పెరుగుతుంది.

