Telangana Budget 2026: రేవంత్ సర్కార్ బడ్జెట్ అంచనాలివే

naveen
By -

బడ్జెట్ అంటే కేవలం అసెంబ్లీలో మంత్రులు చదివే అంకెల గారడీ కాదు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సగటు సామాన్యుడి జీవితాన్ని శాసించే ఆర్థిక ప్రణాళిక. గ్యాస్ సిలిండర్ రేటు నుంచి.. కరెంట్ బిల్లుల దాకా మన జేబులో ఎంత మిగులుతుంది అనేది డిసైడ్ చేసేది ఇదే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ (2026-27)కు ఇప్పుడు రంగం సిద్ధమైంది.


ఫిబ్రవరి 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈనెల 28న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసలు ఈ బడ్జెట్‌తో సామాన్యుడికి ఒరిగేదేంటి? కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్ లాంటి చారిత్రక నగరాల అభివృద్ధికి, ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఈ బడ్జెట్‌లో తగిన చోటు దక్కుతుందా?


Telangana Budget 2026


సంక్షేమానికే పెద్దపీట.. గ్యారెంటీల అమలుకు నిధులు 


ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపైనే ప్రధాన ఫోకస్ ఉండనుంది.


రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి (200 యూనిట్ల ఫ్రీ కరెంట్) వంటి కీలక హామీల అమలుకు ఇంధన, సంబంధిత శాఖలకు నిధుల వరద పారనుంది. బడ్జెట్‌పై సభ్యులు సమగ్రంగా చర్చించేందుకు వీలుగా ఏకంగా 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది.


గత రికార్డులను బ్రేక్ చేసేలా కేటాయింపులు! 


గతేడాది (2025-26) మార్చిలో రూ.3,04,965 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికే రూ.24,439 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.31,605 కోట్లు కేటాయించారు. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా పెరిగే అవకాశం ఉంది.


సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రీజినల్ రింగు రోడ్డు (RRR), రేడియల్ రోడ్ల నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లోనే పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులను కూడా ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది.


పథకాలు ఓకే.. ఆదాయం ఎక్కడినుంచి? 


పథకాలకు వేల కోట్లు కేటాయించడం ఎంత ముఖ్యమో, వాటికి నిధులు సమకూర్చడం కూడా అంతే ముఖ్యం! పన్నుల రూపంలో సామాన్యుడిపై ప్రత్యక్ష, పరోక్ష భారాలు మోపకుండా.. సంపద సృష్టించే దిశగా ఈ బడ్జెట్ ఉంటేనే ప్రభుత్వానికి అసలైన విజయం. లేదంటే ఒక జేబులో పెట్టి, మరో జేబులోంచి లాగేసుకున్నట్లే అవుతుంది.


Tags: