తెలంగాణలో ఫ్లైట్ ఎక్కాలంటే శంషాబాద్ వెళ్లాల్సిందేనా? ఆ దశాబ్దాల నిరీక్షణకు ఇప్పుడు తెరపడబోతోంది. మన వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ పనులు ఇప్పటికే ఊపందుకోగా.. ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ (Adilabad) వంతు వచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్‌కు అధికారికంగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అసలు ఈ ఎయిర్‌పోర్టు వస్తే ఓ సామాన్యుడికి లాభం ఏంటి? కేవలం విమానాలు ఎగరడం వల్లే ఆ వెనుకబడిన ప్రాంత రూపురేఖలు ఎలా మారబోతున్నాయి?
దశాబ్దాల కల సాకారం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు అనుమతి వచ్చిందని స్థానిక ఎంపీ గోడం నగేష్ (Godam Nagesh), ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు.
త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి, ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారుల పర్యవేక్షణలో పనులు మొదలుపెడతామని వారు తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ ప్రతిని మీడియాకు విడుదల చేశారు. ఇది కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని, గిరిజన ప్రాంతానికి ఇదొక టర్నింగ్ పాయింట్ అని ఎంపీ పేర్కొన్నారు.
సామాన్యుడికి లాభం ఏంటి?
ఎయిర్‌పోర్టు అంటే కేవలం డబ్బున్న వారు ప్రయాణించే సాధనం కాదు. విమానాశ్రయం వస్తే ఆ ప్రాంతానికి కనెక్టివిటీ అమాంతం పెరుగుతుంది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల సుమారు 10 వేల ఎకరాల్లో కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
దీనివల్ల స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా రవాణా చేసుకునే అవకాశం లభిస్తుంది. అటవీ ప్రాంతాల్లో పర్యాటకం (Tourism) పెరిగి, స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు వస్తాయి.
మంత్రులకు ఎంపీ కృతజ్ఞతలు
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నారని ఎంపీ నగేష్ ప్రశంసించారు. ఆదిలాబాద్ ప్రజల కలను నిజం చేసినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్ వస్తే ఎకానమీ మారుతుంది!
విమానాశ్రయం రాకతో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఐటీ రంగాలు చిన్న నగరాలకు సైతం విస్తరిస్తాయి. మన వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ లాంటి టైర్-2 సిటీ ఎయిర్‌పోర్టులు పూర్తయితే.. తెలంగాణ అభివృద్ధి కేవలం హైదరాబాద్ సెంట్రిక్‌గా కాకుండా రాష్ట్రమంతా విస్తరించడం ఖాయం. ఇది కచ్చితంగా యువతకు ఒక భరోసా ఇచ్చే పరిణామం!

