రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని సామాన్యుడు ఎప్పుడూ వింటూనే ఉంటాడు. కానీ, అది ఎంత పచ్చి నిజమో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశానికి ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మిన బంటుగా, ఆమె జైలుకు వెళ్లినప్పుడు సీఎం కుర్చీని కంటికి రెప్పలా కాపాడిన అన్నాడీఎంకే సీనియర్ నేత ఓ. పన్నీర్‌సెల్వం (OPS).. ఇప్పుడు బద్ధ శత్రువైన డీఎంకే (DMK) గూటికి చేరారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోవడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. సిద్ధాంతాలు, ఆశయాలు అంటూ ఓట్లు అడిగే నాయకులు.. తమ ఉనికి ప్రమాదంలో పడితే ఏ గట్టుకైనా చేరుతారని ఈ పరిణామం సామాన్యుడికి స్పష్టం చేస్తోంది. అసలు ఓపీఎస్ దారెందుకు మారారు? ఈపీఎస్ వ్యూహం ఏంటి?
అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు.. ఓపీఎస్ అవుట్!
గత కొంతకాలంగా అన్నాడీఎంకే (AIADMK) లో ఎడప్పాడి పళనిస్వామి (EPS), పన్నీర్‌సెల్వం మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఈపీఎస్.. 2022లో ఓపీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించి తలుపులు మూసేశారు.
తనను దారుణంగా అవమానించిన ఈపీఎస్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే కసితోనే ఓపీఎస్ ఇప్పుడు ఏకంగా డీఎంకేతో చేతులు కలిపారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన శుక్రవారం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన మద్దతుదారులు ఆర్.వైతిలింగం, పాల్ మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరి ఈ సంచలన మార్పుకు ముందే పునాది వేశారు.
అమిత్ షా మంత్రాంగం ఫెయిల్.. శంకర మఠం డైలాగ్!
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పుడు కూడా అన్నాడీఎంకే వర్గాలన్నీ ఏకం కావాలని ఓపీఎస్ కోరారు. కానీ ఈపీఎస్ మొండి వైఖరితో అందుకు ససేమిరా అన్నారు. "విడిపోయిన అన్నాడీఎంకే వల్ల డీఎంకేను ఢీకొట్టలేరు" అని షా స్పష్టం చేశారు.
అన్ని దారులు మూసుకుపోవడంతో "నేను శంకర మఠంలో చేరాలా?" అని ఓపీఎస్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. చివరకు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు స్టాలిన్‌తో చర్చలు జరిపి డీఎంకేలో చేరడమే ఏకైక మార్గంగా ఎంచుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్ పక్కా.. ఈపీఎస్‌కు టెన్షన్
డీఎంకేలో చేరిన ఓపీఎస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఆయన సొంత ఇలాకా అయిన థేని జిల్లాలోని బోడినాయకనూర్ లేదా ఆ ప్రాంతంలోని మరో బలమైన స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉంది.
గత (2024) ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ఏకంగా 3.42 లక్షల ఓట్లు తెచ్చుకున్న ఓపీఎస్.. ఇప్పుడు అధికార డీఎంకే అండతో బరిలోకి దిగితే, ఆ ప్రాంతంలో అన్నాడీఎంకే (ఈపీఎస్ వర్గం) ఓటు బ్యాంకుకు భారీ గండి పడటం ఖాయం.
అమ్మ అడుగుజాడల నుంచి.. స్టాలిన్ పక్షాన!
ఒకప్పుడు డీఎంకేను బద్ధ శత్రువుగా భావించిన అమ్మ (జయలలిత) అడుగుజాడల్లో నడిచిన నేత.. ఇప్పుడు కరుణానిధి వారసుడి పక్షాన నిలబడటం రాజకీయాల్లో ఒక విషాద పరిహాసం. ఈ పరిణామంతో అన్నాడీఎంకే మరింత బలహీనపడటం, వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ కు బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పన్నీర్‌సెల్వం చేరికతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాజకీయాల్లో 'సిద్ధాంతం' కంటే 'సర్వైవల్' (మనుగడ) ముఖ్యమని ఈ ఎపిసోడ్ ప్రూవ్ చేసింది!

