మనలో చాలామంది పరుగుల జీవితంలో పడి ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. డబ్బు, కీర్తి ఉంటే చాలు జీవితం సాఫీగా సాగిపోతుందని భ్రమపడుతుంటారు. కానీ, వందల కోట్లు, ఖండాంతరాలు దాటిన కీర్తి ఉన్నా.. ఆరోగ్యం సహకరించకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అని నిరూపిస్తోంది 'భల్లాలదేవ' రానా దగ్గుబాటి జీవితం. బాహుబలి లాంటి కండలు తిరిగిన దేహం నుంచి, అద్దంలో తనను తాను గుర్తుపట్టలేనంతగా కృశించిపోయిన ఆయన ప్రయాణం ప్రతి సామాన్యుడికీ ఓ కనువిప్పు. కిడ్నీ సమస్యలతో చావుబతుకుల మధ్య పోరాడిన రానా.. జీవితం గురించి చెప్పిన పచ్చి నిజాలు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ప్రాణాల ముందు ఇమేజ్ ఎంత?
'బాహుబలి' సిరీస్‌తో రానా క్రేజ్ ఆకాశాన్ని తాకింది. కానీ ఆ తర్వాత ఆయన కిడ్నీ సమస్యలతో తీవ్రంగా పోరాడారు. చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆయన మనసులో 'బతకాలి' అన్న ఒకే ఒక్క కోరిక తప్ప, సినిమా కెరీర్ గురించిన ఆలోచనే లేదు.
దాదాపు ఏడాది పాటు మృత్యువుతో పోరాడి తిరిగి వచ్చిన తర్వాత రానా శరీరం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సిక్స్‌ప్యాక్‌తో బెదరగొట్టిన భల్లాలదేవుడు, అద్దంలో తనను తాను చూసుకుని కుంగిపోయారు. ఆ క్షణంలోనే జీవితం అంటే ఏమిటో, 'నేనెవరు' అనే ప్రశ్నలకు ఆయనకు సమాధానం దొరికింది.
వరుణ్ తేజ్‌ను చూసి కన్నీళ్లు!
అనారోగ్య సమయంలో తనను పలకరించడానికి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను చూసి రానా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "నేను ఉండాల్సిన రూపంలో వరుణ్ ఉన్నాడు, నా కథలన్నీ అతడికే ఇచ్చేయాలా?" అని రానా అనుకున్నారంటే ఆయన ఎంతటి మానసిక క్షోభను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.
శరీరం సహకరించని పరిస్థితుల్లో ఒక రెజ్లర్ బయోపిక్ కోసం తీసుకున్న అడ్వాన్సులను సైతం రానా వెనక్కి ఇచ్చేశారు. నటుడిగా తన ఇమేజ్ కంటే, నిర్మాతల పట్ల బాధ్యతే ముఖ్యమని భావించి కోట్ల రూపాయల ప్రాజెక్టులను వదులుకున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇదే అసలు సిసలైన సూత్రం!
యువత, సామాన్యులు రానా జీవితం నుంచి ఒక పచ్చి నిజం గ్రహించాలి. కెరీర్ కోసం అర్ధరాత్రుల వరకు నిద్రపోకుండా, జంక్ ఫుడ్ తింటూ శరీరాన్ని పాడుచేసుకుంటే రేపు చేతిలో కోట్ల రూపాయలు ఉన్నా ప్రాణాలను నిలపలేవు. అమెరికాలో ఓ ఇమిగ్రేషన్ ఆఫీసర్ "కింగ్ భల్లాలదేవ" అని పిలిచినప్పుడు రానాకు వచ్చిన ఆనందం, ఆయన పోరాట స్ఫూర్తిని పెంచింది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, మళ్లీ ఎలా లేచి నిలబడాలో రానా మనకు నేర్పించారు. మన దేహమే మనకు అసలైన ఆస్తి, దాన్ని కాపాడుకోవడమే మన ప్రథమ కర్తవ్యం.

