'పారిపోండి.. ప్రాణాలు దక్కించుకోండి!' ఇరాన్‌లో ఉన్నోళ్లకు అమెరికా సీరియస్ వార్నింగ్.. గల్ఫ్‌లో యుద్ధం తప్పదా?
మీరు ఒక దేశంలో ఉన్నారు.. ఉన్నట్టుండి మీ ప్రభుత్వం నుంచి "వెంటనే అక్కడి నుంచి పారిపోండి, ఎలా వస్తారో మాకు అనవసరం, ప్రభుత్వం సాయం కోసం కూడా చూడొద్దు" అని మెసేజ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడు ఇరాన్ (Iran)లోని అమెరికా పౌరుల పరిస్థితి ఇదే. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఏ క్షణమైనా యుద్ధం రావొచ్చనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు మాటల యుద్ధానికే పరిమితమైన ట్రంప్ (Donald Trump) సర్కార్.. ఇప్పుడు తమ పౌరులను వెనక్కి రమ్మనడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
విమానాలు బంద్.. నడుచుకుంటూ అయినా వచ్చేయండి!
అమెరికా జారీ చేసిన అడ్వైజరీ చూస్తేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. "ప్రభుత్వం విమానాలు పంపిస్తుందని, సాయం చేస్తుందని ఎదురుచూడకండి. ఉన్నపళంగా ఇరాన్ దాటి బయటకు వచ్చేయండి" అని పౌరులను హెచ్చరించింది. ఇరాన్‌కు విమాన సర్వీసులు రద్దయ్యాయి కాబట్టి, భూమార్గంలోనే దేశం దాటాలని సూచించింది. ఆర్మేనియా, తుర్కియే వంటి పొరుగు దేశాలకు రోడ్డు మార్గంలో వెళ్లి ప్రాణాలు దక్కించుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఇరాన్‌లో చీకటి రోజులు.. కమ్యూనికేషన్ కట్
ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం, రోడ్ల దిగ్బంధం, మొబైల్ వినియోగంపై ఆంక్షలతో దేశం అట్టుడికిపోతోంది. బయట ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ ఉండటం క్షేమం కాదని అమెరికా భావిస్తోంది. అందుకే కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలకముందే బయటపడాలని తమ పౌరులను అలర్ట్ చేసింది.
ఖమేనీకి చెక్.. ఆందోళనకారులకు ట్రంప్ కిక్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలే తిరగబడ్డారు. ఈ నిరసనలకు అమెరికా బహిరంగ మద్దతు ప్రకటించింది. ఖమేనీ పాలనకు ముగింపు పలకాలన్న ప్రజల డిమాండ్ న్యాయమైనదేనని ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై ఇరాన్ ప్రభుత్వం కాల్పులు జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అమానుష చర్యలు ఆపకపోతే, అమెరికా దాడులకు దిగుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఒమన్ చర్చలే చివరి దిక్కు!
మాట వినకపోతే యుద్ధమేనని అమెరికా ఇప్పటికే గల్ఫ్ (Gulf)కు యుద్ధ విమానాలను, బలగాలను తరలించింది. అణు కార్యకలాపాలు ఆపాలని అల్టిమేటం జారీ చేసింది. అయితే గల్ఫ్ దేశాల జోక్యంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చివరి ప్రయత్నంగా చర్చలకు ఓకే చెప్పారు. దీంతో ఈరోజు ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు విఫలమైతే మాత్రం.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం అనివార్యం కావచ్చు.
శాంతి చర్చలా? యుద్ధానికి విరామమా?
ఒమన్ చర్చలు సఫలమైతే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది. లేదంటే అమెరికా పౌరుల తరలింపు అనేది రాబోయే భీకర యుద్ధానికి సంకేతం మాత్రమే. వచ్చే 24 గంటలు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకం.

.webp)