ఏఐతో అమెరికాకే ముప్పు అంటే.. మన పరిస్థితి ఏంటి? ట్రెజరీ సెక్రటరీ వార్నింగ్ బెల్!
మనం లోన్ అప్లికేషన్ పెట్టగానే నిమిషాల్లో అప్రూవల్ వస్తోంది కదా అని సంబరపడుతున్నాం. కస్టమర్ కేర్ లో మనిషికి బదులు రోబో మాట్లాడుతుంటే టెక్నాలజీ పెరిగిందని మురిసిపోతున్నాం. కానీ ఆ వెనుక ఉన్న 'కృత్రిమ మేధ' (AI) రేపు పొద్దున బ్యాంకులను ముంచేస్తే? ఇదేదో సినిమా స్టోరీ కాదు.. సాక్షాత్తు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ (Scott Bessent) వెల్లడించిన భయం. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం గుర్తుందా? అలాంటి ముప్పు మళ్ళీ ఏఐ రూపంలో రావొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.
గొప్ప టూలా? లేక ప్రమాదకర ఆయుధమా?
ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్ (FSOC) 2025 నివేదికలో ఏఐని 'రెడ్ జోన్'లో పెట్టారు. ఇది అద్భుతమైన టెక్నాలజీనే.. ఫ్రాడ్ ను పసిగట్టడానికి, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు బాగానే ఉపయోగపడుతోంది. కానీ, ఇదే టెక్నాలజీని హ్యాకర్లు, లేదా ప్రభుత్వేతర శక్తులు వాడితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని బెస్సెంట్ సెనేట్ కమిటీ ముందు కుండబద్దలు కొట్టారు. ఏఐ అనేది ఒక గొప్ప సాధనమే, కానీ అదే సమయంలో అది చేతిలో ఉన్న కత్తి లాంటిది.. వాడుకోవడం తెలియకపోతే మనల్నే గాయపరుస్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
రాజకీయ రచ్చ.. ఆవిష్కరణ vs భద్రత
దీనిపై అమెరికాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్లు ఏమో "కొత్త ఆవిష్కరణలు ఆపొద్దు, టెక్నాలజీని ప్రోత్సహించండి" అంటుంటే, డెమొక్రాట్లు మాత్రం "సేఫ్టీ లేకుండా స్పీడ్ డేంజర్, కఠిన ఆంక్షలు ఉండాల్సిందే" అని వాదిస్తున్నారు. ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు బ్యాంకింగ్ రంగానికి, మౌలిక సదుపాయాలకు పెద్ద తలనొప్పిగా మారింది. సంక్షోభం వచ్చాక ఏడ్చేకంటే.. ముందే సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ను గుర్తించి సరిచేయడమే తమ లక్ష్యమని బెస్సెంట్ స్పష్టం చేశారు.
భారత్ కు ఎందుకు దడ?
అమెరికాలో తుమ్మితే భారత్ లో జలుబు చేస్తుందంటారు. ఇప్పుడు మన బ్యాంకులు, ఫిన్ టెక్ యాప్స్ అన్నీ ఏఐ మీదే నడుస్తున్నాయి. అమెరికా గనుక ఏఐపై కఠిన నిబంధనలు (Regulations) తెస్తే, ఆ ప్రభావం ఇక్కడి టెక్ కంపెనీల మీద, మన బ్యాంకింగ్ వ్యవస్థ మీద పడటం ఖాయం. సరిహద్దులతో సంబంధం లేకుండా సాగే ఆర్థిక లావాదేవీలపై ఈ కొత్త రూల్స్ ప్రభావం చూపిస్తాయి.
కళ్లెం లేని గుర్రం ప్రమాదకరం!
టెక్నాలజీ స్పీడ్ గా ఉండొచ్చు.. కానీ ఫైనాన్స్ అనేది నమ్మకం మీద నడిచే వ్యవస్థ. ఏఐని గుడ్డిగా నమ్మితే, అది ఇచ్చే ఫలితం డిజిటల్ మాంద్యానికి దారితీయొచ్చు. అమెరికా హెచ్చరికను భారత్ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన సమయం ఇది.

