Tech Update: హెచ్-1బీ వీసా కష్టాలకు గుడ్ బై.. గూగుల్ మాస్టర్ ప్లాన్ ఇదే

naveen
By -

అమెరికాలో ఉద్యోగం చేయాలనే భారతీయుల కలలకు హెచ్-1బీ వీసా నిబంధనలు అడ్డుకట్ట వేస్తుంటే, టెక్ దిగ్గజం గూగుల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. 'మీరు వీసాలు ఇవ్వకపోతే మాకేంటి.. మేమే ఇండియాకు వస్తాం' అన్నట్టుగా ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన కఠిన నిబంధనల వల్ల టెక్ కంపెనీలకు నియామకాలు భారంగా మారాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్ ఏకంగా బెంగళూరులో అతిపెద్ద ఆఫీసును ఏర్పాటు చేస్తోంది. అసలు గూగుల్ ప్లాన్ ఏంటి? ట్రంప్ నిర్ణయం పరోక్షంగా భారత్ కు ఎలా కలిసొచ్చింది?


Google to set up massive campus in Bengaluru for 20,000 employees amidst US H-1B visa constraints


వైట్‌ఫీల్డ్‌లో గూగుల్ సామ్రాజ్యం

హెచ్-1బీ వీసా చిక్కులు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూసే ఓపిక లేక గూగుల్ సంస్థ భారత్ లోనే తన కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమైంది. దీనికోసం బెంగళూరులోని ప్రముఖ టెక్ కారిడార్ అయిన వైట్‌ఫీల్డ్‌ ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడ ఏకంగా 20 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా ఒక భారీ క్యాంపస్ ను సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక పెద్ద ఆఫీసు టవర్ ను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లీజుకు తీసుకోగా, మరో రెండు టవర్ల కోసం చర్చలు జరుపుతోంది. ఈ మూడు టవర్లు కలిపి దాదాపు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని సమాచారం. మొదటి టవర్ లో మరికొన్ని నెలల్లోనే పనులు మొదలుకానుండగా, మిగిలినవి వచ్చే ఏడాదికి పూర్తి కానున్నాయి.


అమెరికా దాటితే.. ఇండియానే అడ్డా

ప్రస్తుతం భారత్ లో గూగుల్ కు 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వైట్‌ఫీల్డ్‌ క్యాంపస్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, అమెరికా వెలుపల గూగుల్ కు ఇదే అతిపెద్ద కేంద్రంగా మారే అవకాశముంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు కృత్రిమ మేధ (AI) పైనే పూర్తి దృష్టి సారించాయి. ఏఐ మార్కెట్ సృష్టికి, అధునాతన ఇంజినీరింగ్ కార్యకలాపాలకు భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారత్ లో అడుగుపెట్టగా, ఇప్పుడు గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. భారతీయ మేధాశక్తిని ఇక్కడే వినియోగించుకోవాలనేది గూగుల్ వ్యూహంగా కనిపిస్తోంది.


ట్రంప్ షాక్.. ఇండియాకు జాక్ పాట్

గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పాలి. హెచ్-1బీ వీసా దరఖాస్తులకు ఏకంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలనే కొత్త నిబంధన కంపెనీలకు పెనుభారంగా మారింది. ఒక ఉద్యోగిని అమెరికా తీసుకెళ్లడానికి ఇంత ఖర్చు చేయడం, పైగా వీసా జాప్యాలు భరించడం కంటే.. ఆ పనిని భారత్ నుంచే చేయించడం ఉత్తమమని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే తమ దీర్ఘకాలిక నియామక ప్రణాళికలను మార్చుకుని, బెంగళూరు వైపు చూస్తున్నాయి. ఇది పరోక్షంగా భారతీయ టెక్కీలకు శుభవార్త అనే చెప్పాలి.


అవకాశం తలుపు తట్టలేదు.. తలుపు బద్దలు కొట్టుకుని వచ్చింది! 

అమెరికా తలుపులు మూసేస్తే భారతీయ టెక్కీలకు నష్టం అని భయపడ్డాం. కానీ గూగుల్ నిర్ణయం చూస్తుంటే.. అమెరికా కంపెనీలే మన దగ్గరకు క్యూ కట్టే రోజులు వచ్చాయి. ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానం చివరికి 'ఇండియా బెస్ట్' అనేలా మార్చేసింది.