జెన్ జీకి మీమ్స్ అంటే ఎందుకంత పిచ్చి? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు

naveen
By -

మీమ్స్ చూడందే రోజు గడవట్లేదా? ఏదైనా విషయం చెప్పాలంటే టైపింగ్ కంటే మీమ్ షేర్ చేయడమే ఈజీగా ఉందా? అయితే మీరు పక్కా జెన్ జీ (Gen Z)! 'ఒడియమ్మా బంటీ' నుంచి 'ఫ్లాష్‌మ్యాన్‌' వరకు సోషల్ మీడియాను ఊపేస్తున్న మీమ్స్ కల్చర్ వెనుక పెద్ద సైకాలజీనే ఉంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి, రాజకీయాలపై సెటైర్లు వేయడానికి యువత మీమ్స్ నే ఎందుకు ఎంచుకుంటోంది? అసలు ఈ మీమ్స్ కల్చర్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? కేవలం నవ్వు కోసమేనా లేక ఇది ఒక కొత్త రకం భావ విప్లవమా?


A group of young people looking at a smartphone and laughing at a meme


మీమ్స్ లేనిదే ముద్ద దిగదు.. నిద్ర రాదు

ఈ తరం యువత దినచర్య పూర్తిగా మారిపోయింది. అలారం మోగగానే కళ్లు తెరిచి, బెడ్ దిగకముందే చేసే మొదటి పని మొబైల్ చేతిలోకి తీసుకోవడం. ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఓపెన్ చేసి ఓ నాలుగు మీమ్స్ చూసి, నచ్చినవి ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే గానీ వాళ్లకు రోజు మొదలవ్వదు. దీనికి ప్రధాన కారణం వారిలోని ఓపిక లేకపోవడమే. పెద్ద పెద్ద ప్రసంగాలు వినాలన్నా, పేజీల కొద్దీ వ్యాసాలు చదవాలన్నా వారికి ఇప్పుడు ఆసక్తి లేదు. ఏదైనా విషయాన్ని ఒక ఫోటో, రెండు ముక్కల క్యాప్షన్ తో చెప్పేస్తే ఇట్టే అర్థం చేసుకుంటున్నారు. సంతోషమైనా, బాధైనా, చిరాకైనా.. ప్రతి ఎమోషన్ కి సరిగ్గా సరిపోయే మీమ్ ఒక్కటి పడితే చాలు, చెప్పాల్సిన మేటర్ మొత్తం అవతలి వారికి రీచ్ అయిపోతుంది.


ఒత్తిడికి అసలైన మందు మీమ్స్

డిజిటల్ ప్రపంచంలోనే పుట్టి పెరిగిన ఈ జనరేషన్ కు స్నేహాలు, ప్రేమలు, గొడవలు, బ్రేకప్ లు అన్నీ స్క్రీన్ మీదే జరుగుతుంటాయి. అందుకే వీరి సంభాషణల్లో పదాల కంటే ఎమోజీలు, మీమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కాలంతో పాటు పరుగులు తీస్తున్న యువతలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. చదువు, ఉద్యోగం, రిలేషన్ షిప్స్ అంటూ సతమతమయ్యే వారికి మీమ్స్ ఒక పెయిన్ కిల్లర్ లా పనిచేస్తున్నాయి. ఆఫీసులో బాస్ తిట్టినా, కాలేజీలో ఎగ్జామ్స్ టెన్షన్ ఉన్నా.. 'మన బతుకింతే' అనే ఒక్క మీమ్ చూసుకోగానే వచ్చే రిలీఫ్ మామూలుగా ఉండదు. కాసేపు నవ్వుకుని, ఆ ఒత్తిడిని మర్చిపోయి మళ్ళీ పనిలో పడుతున్నారు. అందుకే ఖాళీ దొరికితే చాలు టీ తాగినంత అలవాటుగా మీమ్స్ స్క్రోల్ చేస్తున్నారు.


టైపింగ్ కష్టం.. మీమ్ ఇష్టం

ఇతరులతో తమ భావాలను పంచుకోవడానికి సుదీర్ఘమైన మెసేజ్ లు టైప్ చేయడం అంటే నేటి యువతకు బద్ధకం. అదొక పెద్ద టాస్క్ లా ఫీల్ అవుతున్నారు. దానికి బదులుగా తమ ఫీలింగ్ ని ప్రతిబింబించే ఒక సినిమా క్లిప్ నో, ట్రెండింగ్ టెంప్లేట్ నో వాడేస్తున్నారు. ఇది కేవలం కమ్యూనికేషన్ కోసమే కాదు, కొత్త స్నేహాలను చిగురింపజేయడానికి కూడా వాడుతున్నారు. ఆన్‌లైన్ లో ఒకే రకమైన మీమ్స్ ఇష్టపడే వారి మధ్య వేవ్ లెంగ్త్ కలుస్తోంది. 'అరె, నా ఫీలింగ్ కూడా సేమ్ రా' అనుకుంటూ పరిచయాలు పెంచుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో మొదలైన మీమ్ ఫ్రెండ్షిప్స్, రియల్ లైఫ్ లో గెట్ టుగెదర్ పార్టీల వరకు వెళ్తున్నాయి.


హాస్యం ముసుగులో సీరియస్ పాలిటిక్స్

మీమ్స్ అంటే కేవలం టైమ్ పాస్ మాత్రమే అనుకుంటే పొరపాటే. రాజకీయాలు, సామాజిక అంశాలపై తమ నిరసనను, అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టడానికి యువత వీటినే వాడుకుంటోంది. ట్రంప్ టారిఫ్ ల నుంచి స్థానిక రాజకీయాల వరకు ఏ అంశాన్నైనా వ్యంగ్యంగా ప్రశ్నించడానికి మీమ్స్ ని మించిన ఆయుధం లేదు. సీరియస్ గా చెబితే గొడవలవుతాయేమో కానీ, నవ్విస్తూ చెబితే ఎవరైనా ఆలోచించాల్సిందే. అదే ఇప్పుడు జెన్ జీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ. వివాదాలకు పోకుండానే, తమ అసంతృప్తిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు.


మీమ్స్ అనేవి జోకులు మాత్రమే కాదు.. అదొక ఎమోషన్! 

భాష నిరంతరం మారుతూ ఉంటుంది అనడానికి ఈ మీమ్ కల్చరే నిదర్శనం. యువతను అర్థం చేసుకోవాలంటే.. ముందు వాళ్ళు షేర్ చేసే మీమ్స్ ని అర్థం చేసుకోవడం మంచిది.


Tags: