ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం బిల్ గేట్స్ (Bill Gates) విడాకుల వెనుక అసలు కారణం ఏంటి? 27 ఏళ్ల వైవాహిక బంధం ఎందుకు ముక్కలైంది? ఇన్నాళ్లకు ఈ మిస్టరీ వీడింది. కుంభకోణాల రారాజు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ స్కాండల్‌లో బిల్ గేట్స్ పేరు వినిపించడం, దానికి సంబంధించిన చీకటి కోణాలు వెలుగులోకి రావడంతో ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ (Melinda Gates) మౌనం వీడారు. "ఆ సమయంలో నేను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ ఫైల్స్ లో ఏముంది? బిల్ గేట్స్ రహస్యంగా మందులు ఎందుకు అడిగారు?
నమ్మకం పోయింది.. బంధం తెగింది!
తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలపై మిలిందా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "బిల్‌గేట్స్ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నారని తెలిసినప్పుడు నేను తీవ్రమైన మానసిక క్షోభ (Mental Trauma) అనుభవించాను. మా బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన కనీస విలువలను ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అందుకే ఆ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చింది" అని మిలిందా కుండబద్దలు కొట్టారు. ఆ సమయం తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనదని ఆమె గుర్తుచేసుకున్నారు.
రష్యన్ మహిళలతో లింకులు.. ఆ సీక్రెట్ మందులు!
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ గురించి దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు ఉన్నాయి.
రష్యన్ మహిళలు: గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగించారని ఎప్‌స్టీన్ ఆరోపించారు.
సీక్రెట్ మెడిసిన్: ఆ సంబంధాల వల్ల గేట్స్ సుఖవ్యాధుల బారిన పడ్డారని, ఈ విషయం భార్య మిలిందాకు తెలియకుండా ఉండేందుకు.. రహస్యంగా యాంటీబయాటిక్స్ (Antibiotics) ఇవ్వమని తనను అడిగారని ఎప్‌స్టీన్ పేర్కొన్నారు. ఈ విషయాలే మిలిందా మనసును ముక్కలు చేశాయని, ఎప్‌స్టీన్ తో గేట్స్ స్నేహం ఆమెకు అస్సలు నచ్చేది కాదని వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలోనే వెల్లడించింది.
ఆయననే అడగండి.. నాకేం సంబంధం?
తాజాగా బయటపడ్డ ఈ విషయాలపై మిలిందా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. "ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ఆయనే.. నేను కాదు. ఆయన చేసిన పనులకు ఆయనే జవాబుదారీ" అని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు, బిల్ గేట్స్ బృందం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఇవన్నీ అసంబద్ధమైనవని కొట్టిపారేసింది.
విలువల ముందు వేల కోట్లు పనికిరావు!
నమ్మకం అనే పునాది కదిలితే.. అది ఎంతటి సామ్రాజ్యమైనా, సంసారమైనా కుప్పకూలాల్సిందే. బిల్ గేట్స్ జీవితం నేర్పుతున్న పాఠం ఇదే.

