ట్రంప్ ఫ్యామిలీకి జాక్ పాట్.. 'స్పై షేక్'తో రూ.4,200 కోట్ల డీల్! క్రిప్టో ముసుగులో వైట్ హౌస్ బిజినెస్?

naveen
By -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్రిప్టో కరెన్సీ అంటే ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? బిట్‌కాయిన్ కు ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికినట్లే ఉంది. ఇది కేవలం దేశ ఆర్థిక విధానం మాత్రమే కాదు.. ట్రంప్ కుటుంబానికి కాసుల వర్షం కురిపించే అతిపెద్ద వ్యాపారం! తాజాగా ట్రంప్ ఫ్యామిలీ యూఏఈకి చెందిన ఒక 'స్పై షేక్' (Spy Sheikh) తో కుదుర్చుకున్న భారీ ఒప్పందం బయటపడింది. దీని విలువ అక్షరాలా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,200 కోట్లు). అసలు ఎవరీ స్పై షేక్? పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ ఫ్యామిలీకి ఉన్న లింక్ ఏంటి? 


Donald Trump and Sheikh Tahnoon bin Zayed Al Nahyan image


'స్పై షేక్' ఎంట్రీ.. 49% వాటా కొనుగోలు

ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ట్రంప్ కుటుంబానికి చెందిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' (World Liberty Financial) సంస్థలో.. యూఏఈకి చెందిన షేక్ తహనూన్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ (Sheikh Tahnoon) ఏకంగా 49 శాతం వాటాను కొనుగోలు చేశారు.

  • ఎవరీ స్పై షేక్?: ఈయన యూఏఈ అధ్యక్షుడి సోదరుడు, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA), మరియు ప్రభుత్వ వెల్త్ ఫండ్ అధిపతి. గూఢచారి వ్యవస్థను నడిపిస్తారు కాబట్టి 'స్పై షేక్' అని పిలుస్తుంటారు.

  • డీల్ విలువ: మొత్తం 500 మిలియన్ డాలర్లు. ఇందులో సగం డబ్బు ముందస్తుగా చెల్లించారు.

  • ట్రంప్ ఫ్యామిలీ వాటా: ఈ డీల్ ద్వారా ట్రంప్ కుటుంబ సభ్యుల జేబులోకి నేరుగా 187 మిలియన్ డాలర్లు వెళ్లాయట. ఈ ఒప్పందం పత్రాలపై ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సంతకం చేశారు.


క్విడ్ ప్రో కో.. ఇచ్చి పుచ్చుకోవడం!

యూఏఈ ఇంత భారీ మొత్తాన్ని ట్రంప్ సంస్థలో ఎందుకు పెట్టింది? దీని వెనుక ఒక పెద్ద 'డీల్' ఉంది. జో బైడెన్ హయాంలో అమెరికా నుంచి యూఏఈకి 'ఏఐ హార్డ్‌వేర్' (AI Hardware) ఎగుమతులపై ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రావడంతో.. ఈ క్రిప్టో డీల్ కు ప్రతిఫలంగా యూఏఈకి ఆ ఏఐ చిప్స్, టెక్నాలజీ అందుబాటులోకి రానుందని సమాచారం. అంటే వ్యాపారం ట్రంప్ ఫ్యామిలీది.. లాభం యూఏఈది.. మధ్యలో వాడేది అమెరికా టెక్నాలజీ!


పాక్ ఆర్మీ చీఫ్ తోనూ దోస్తీ..

ట్రంప్ ఫ్యామిలీ క్రిప్టో సామ్రాజ్యం కేవలం గల్ఫ్ కే పరిమితం కాలేదు. గతేడాది ఏప్రిల్ లో 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' సంస్థ పాకిస్థాన్ లోనూ అడుగుపెట్టింది. సాక్షాత్తు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ (Asim Munir) సమక్షంలో 'పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్'తో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, అల్లుడు జేరెడ్ కుష్నర్లు ఈ వ్యాపారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.


ఇది పాలనా? వ్యాపారమా? 

అధ్యక్ష పదవిలో ఉంటూ సొంత కుటుంబ వ్యాపారాల కోసం విదేశీ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోవడం 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (Conflict of Interest) కిందకు వస్తుంది. క్రిప్టో కరెన్సీ అనేది భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ అయితే.. అది ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో బంగారు బాతుగా మారుతోందన్నది నగ్న సత్యం.