బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులను పంచ్‌లతో పడగొట్టిన ఉక్కు మహిళ మేరీకోమ్ (Mary Kom).. వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఆవేదనను అనుభవించారు. ఇటీవల ఒక టాక్‌షోలో తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. "మగవాళ్లంటే ఇంతేనా?" అనేలా ఆమె మాట్లాడటంపై సోషల్ మీడియా భగ్గుమంది. ఈ వివాదంపై తాజాగా మేరీకోమ్ స్పందించారు. "నా బాధను అర్థం చేసుకోండి.. నేను ఎవరినీ కించపరచలేదు" అంటూ ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. అసలు మేరీకోమ్ కోపానికి కారణం ఏంటి? ఆ బంధం ఎందుకు తెగిపోయింది?
క్షమించండి.. ఆ మాటలు బాధతో వచ్చినవే!
తాజాగా విడుదల చేసిన వీడియోలో మేరీకోమ్ వివరణ ఇచ్చారు. "నా మాటల వల్ల ఎవరైనా, ముఖ్యంగా పురుష సమాజం ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. నాలో ఇన్నాళ్లుగా గూడుకట్టుకున్న ఆవేదన ఆ రూపంలో బయటకు వచ్చింది. ఇతరులను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నా మాటలను వక్రీకరించారు. నేను ఏ ఆటకు గానీ, క్రీడాకారులకు గానీ వ్యతిరేకం కాదు" అని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ క్రీడాకారులను గౌరవిస్తానని తెలిపారు.
నమ్మించి మోసం చేశాడు.. అందుకే విడాకులు
ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా సాగిన తమ దాంపత్యం ముక్కలవ్వడానికి గల అసలు కారణాన్ని మేరీకోమ్ బయటపెట్టారు. తన భర్త కరుంగ్ ఆంఖోలర్ (Karung Onkholer) తనను మోసం చేశాడని (Infidelity), ఆ కారణంగానే బంధం చెడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో విడాకులు తీసుకున్న తర్వాత తనపై నెట్టింట్లో అనేక తప్పుడు ప్రచారాలు జరిగాయని, అప్పుడు కూడా తాను మౌనంగానే భరించానని గుర్తు చేశారు. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నారు.
త్యాగం చేయలేదు.. అదంతా అబద్ధం!
మేరీకోమ్ కోసం కరుంగ్ తన ఫుట్‌బాల్ కెరీర్‌ను త్యాగం చేశారన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. కరుంగ్ ఒక మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ అయినప్పటికీ.. "దిల్లీలో మేము కలుసుకునే సమయానికే ఆయన ఫుట్‌బాల్ ఆడటం మానేశారు. నాకోసం కెరీర్ వదులుకున్నానడం అవాస్తవం" అని క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు.
పతకాలు గెలిచినా.. ప్రేమలో ఓడింది!
ప్రపంచానికి ఆమె ఒక విజేత.. కానీ నాలుగు గోడల మధ్య ఆమె ఒక బాధితురాలు. మేరీకోమ్ ఆవేదన, ఆమె మాటల వెనుక ఉన్న నిజం ఇప్పుడు అందరికీ అర్థమైంది.

.webp)