"భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది.. మనది డెడ్ ఎకానమీ" అంటూ విదేశాల్లో విమర్శలు చేసేవారికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఒకే ఒక్క ట్వీట్ తో గట్టి సమాధానం ఇచ్చారు. ప్రపంచ వృద్ధిలో అమెరికాను మించి భారత్ దూసుకెళ్తోందని మస్క్ షేర్ చేసిన గణాంకాలు ఇప్పుడు కేంద్రానికి కొత్త అస్త్రాన్ని ఇచ్చాయి. ఇదే అదనుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), కిరణ్ రిజిజు.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. అసలు మస్క్ చూపించిన ఆ లెక్కల్లో ఏముంది? రాహుల్ పై మంత్రుల దాడికి అసలు కారణం ఏంటి?
చైనా తర్వాత మనమే.. అమెరికా వెనక్కే!
ప్రపంచ వృద్ధికి (Global Growth) భారత్ చోదక శక్తిగా మారుతోంది. ఎలాన్ మస్క్ షేర్ చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం.
చైనా: ప్రపంచ జీడీపీ వృద్ధిలో 26% వాటాతో ప్రథమ స్థానంలో ఉంది.
భారత్: 17% వాటాతో రెండో స్థానంలో దూసుకెళ్తోంది.
అమెరికా: అగ్రరాజ్యం అని పిలవబడే అమెరికా కేవలం 9.9% వాటాతో మనకంటే వెనుకబడి ఉంది.
అంటే ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధిలో 43 శాతం వాటా కేవలం ఇండియా, చైనాల నుంచే వస్తోందన్నమాట. ఈ లెక్కలను ఉదహరిస్తూ నిర్మలా సీతారామన్.. భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తోందో వివరించారు.
రాహుల్.. ఇప్పుడేమంటావ్?
ఓవైపు భారత్ ప్రపంచ వేదికపై సత్తా చాటుతుంటే, మరోవైపు ప్రతిపక్ష నేతలు విదేశాల్లో దేశ పరువు తీస్తున్నారని సీతారామన్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. "దేశం ఇంతలా అభివృద్ధి చెందుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. త్వరలోనే చైనాను కూడా దాటి ముందుకు వెళ్లేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది" అని ఆమె కౌంటర్ ఇచ్చారు.
ఇది డెడ్ ఎకానమీ కాదు.. మస్క్ సాక్ష్యం!
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) కూడా రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గతంలో రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని విమర్శించారు. ఒక బాధ్యత గల పౌరుడి స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. సాధారణంగా నేను విదేశీయుల పోస్టులపై స్పందించను. కానీ రాహుల్ కు బుద్ధి చెప్పడానికే మస్క్ పోస్ట్ ను ప్రస్తావిస్తున్నా" అని రిజిజు చురకలు అంటించారు.
లెక్కలు మారాయి.. ఇక మాటలు మారాలి!
ప్రపంచ కుబేరుడే భారత్ గ్రేట్ అని సర్టిఫికెట్ ఇచ్చాక.. ఇకనైనా రాజకీయ విమర్శలు పక్కనబెట్టి, దేశ వృద్ధిని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అంకెలు అబద్ధం చెప్పవు కదా!

