బడ్జెట్ రోజున దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పన్నులు తగ్గాయా? అని ఆలోచించడం మానేసి.. "ఈసారి నిర్మలమ్మ ఏ రంగు చీర కట్టుకొచ్చారు?" అని వెతికే వారే ఎక్కువయ్యారు. గూగుల్ సెర్చ్ లో బడ్జెట్ హైలైట్స్ కంటే, ఆమె చీర డిజైన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అయితే ఈ వ్యవహారంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నన్ను వేధించకండి.. మగ వాళ్ళనైతే ఇలాగే అడుగుతారా?" అంటూ గట్టిగా నిలదీశారు. ఆమె ఆవేదనలో దాగున్న ఆంతర్యం ఏంటి? ఆ కాంచీపురం చీర వెనుక ఉన్న కథేంటి?
మగ మంత్రులనైతే అడుగుతారా?
ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తన వస్త్రధారణపై జరుగుతున్న చర్చను నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ఇది తనకు ఒక రకమైన ఒత్తిడిని (Stress) కలిగిస్తోందని వాపోయారు. "నేను బడ్జెట్ రోజు ఏం కట్టుకుంటాను అనే ప్రశ్నలతో ఎందుకు వేధిస్తున్నారు? ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టేది ఒక పురుష మంత్రి అయితే.. ఆయన వేసుకున్న సూటు గురించి గానీ, చొక్కా రంగు గురించి గానీ ఇలాగే చర్చిస్తారా?" అని జెండర్ వివక్షపై సూటిగా ప్రశ్నించారు. తన చీరను కూడా బడ్జెట్ లో ఒక అంశంగా మార్చేయడం దురదృష్టకరమన్నారు.
అంకెలు చూడండి.. అంచులు కాదు!
దేశ భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ లోని కీలక అంశాలపై ప్రజలు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. అనవసరమైన విషయాల (చీరల) గురించి ఆలోచించడం వల్ల, బడ్జెట్ లోని ముఖ్యమైన ఆర్థిక కేటాయింపులపై పట్టు కోల్పోతామని హితవు పలికారు. తన పనితీరును, బడ్జెట్ గణాంకాలను విశ్లేషించాలి తప్ప.. తన దుస్తులను కాదని క్లారిటీ ఇచ్చారు.
ఆ 'కాంచీపురం' చీర వెనుక రాజకీయం?
ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్.. బంగారు, కాఫీ రంగు అంచులతో ఉన్న మెజెంటా రంగు 'కాంచీపురం' చీరలో మెరిశారు. తమిళనాడు సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్న ఈ చీర ఎంపిక వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. మరో కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ సంప్రదాయ చీరను ఎంచుకున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సరిగ్గా ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఆమె ఇలా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
మహిళా మంత్రి అనగానే పని కంటే అలంకరణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే సమాజ ధోరణికి నిర్మలమ్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇకనైనా చీరలను వదిలేసి, స్కీములను చూద్దాం.

