చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరినీ అలరించిన పాప.. ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేస్తోంది. 'బేబీ' సారా అర్జున్ ఇప్పుడు 'స్టార్' సారా అర్జున్ (Sara Arjun) గా మారిపోయింది. ఇటీవలే ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో సెన్సేషన్ కు రెడీ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ (Euphoria) సినిమాతో ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సారా చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఓ సినిమా విజయం తన తల్లిదండ్రుల కళ్ళలో నీళ్లు తెప్పించిందట.. అసలు ఆ రోజు ఏం జరిగింది? విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన అమ్మాయి.. టాలీవుడ్ లో ఎలా సెటిల్ అయ్యింది?
ఆనందబాష్పాలు.. నా లైఫ్ లో బెస్ట్ డే!
ఏ నటికైనా మణిరత్నం (Mani Ratnam) సినిమాలో ఛాన్స్ రావడం అంటే కల సాకారమవడమే. సారా విషయంలోనూ అదే జరిగింది. ‘‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) లో నటించిన రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్" అని సారా చెప్పుకొచ్చారు. అయితే ఆమెకు అత్యంత సంతోషాన్నిచ్చిన రోజు మాత్రం వేరే ఉందట. రీసెంట్ గా వచ్చిన ‘ధురంధర్’ సినిమా విజయం ఆమెకు చాలా స్పెషల్ అట. "నా తల్లిదండ్రులు ఆ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. వారి కళ్ళలో ఆనందం చూసి నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఆ క్షణం నా జీవితంలోనే ఆనందకరమైన రోజు" అంటూ సారా భావోద్వేగానికి గురయ్యారు.
విదేశీ చదువు క్యాన్సిల్.. కారణం ఇదే!
నిజానికి 'పొన్నియిన్ సెల్వన్’ తర్వాత సారా అర్జున్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, యాక్టింగ్‌లో మెలకువలు నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. టికెట్లు బుక్ చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో.. 'యుఫోరియా' కథ ఆమె తలుపు తట్టింది. గుణశేఖర్ చెప్పిన కథ, అందులోని సామాజిక అంశం (Social Relevance) ఆమెను కట్టిపడేశాయట. "ఈ కథ కచ్చితంగా ప్రస్తుత సమాజానికి అవసరం అనిపించింది. ఇలాంటి కథలో భాగమయ్యే అవకాశం కొందరికే వస్తుంది. అందుకే ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఈ సినిమా చేశా" అని సారా వివరించారు.
అంతా మ్యాజిక్ లా జరిగింది
తన కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే తనకే ఆశ్చర్యం వేస్తుందని సారా అంటున్నారు. "నా కెరీర్ మొత్తం ఒక మ్యాజిక్‌లా ఉంది. మణిరత్నం గారి సినిమా తర్వాత వెంటనే గుణశేఖర్ గారి ‘యుఫోరియా’కు సైన్ చేయడం.. ఆ షూటింగ్ గ్యాప్ లోనే ‘ధురంధర్’ ఒప్పుకోవడం.. అది సూపర్ హిట్ అవ్వడం.. ఇదంతా ఏదో మ్యాజిక్ లా చకచకా జరిగిపోయింది" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6న రాబోతున్న 'యుఫోరియా' కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.
పాప కాదు.. ఇక పాన్ ఇండియా స్టార్!
సరైన కథలను ఎంచుకుంటూ, అగ్ర దర్శకులతో ప్రయాణం చేస్తున్న సారా అర్జున్.. ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ రేస్ లో ఫ్రంట్ రోలో ఉండటం ఖాయం.

