క్రికెట్ ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 15 కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం "మేం రాంపో" అని భీష్మించుకు కూర్చుంది. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)లో దాయాది సమరం జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ హైడ్రామా మధ్య పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) తొలిసారి నోరు విప్పారు. "మా చేతుల్లో ఏమీ లేదు.. మేం కేవలం పావులం మాత్రమే" అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. అసలు పాక్ డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతోంది? ఈరోజు ఐసీసీ తీసుకోబోయే నిర్ణయం ఏంటి?
మేం ఆడాలనుకున్నా.. ప్రభుత్వం ఒప్పుకోవాలిగా!
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలు పాక్ ఆటగాళ్ళ మానసిక స్థితిని అద్దం పడుతున్నాయి. భారత్ తో మ్యాచ్ బహిష్కరణపై అడిగినప్పుడు.. "ఆ నిర్ణయం మాది కాదు. ఇందులో మేం చేయగలిగిందేమీ లేదు. మా ప్రభుత్వం, పీసీబీ (PCB) ఛైర్మన్ ఏ ఆదేశాలిస్తే వాటిని పాటించాల్సిందే. వాళ్లు వెళ్లమంటే వెళ్తాం.. లేదంటే లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే ఆటగాళ్లు మైదానంలో దిగడానికి సిద్ధంగా ఉన్నా.. పాక్ ప్రభుత్వం వారి కాళ్లకు రాజకీయ బంధం వేసిందన్నమాట.
నేడు ఐసీసీ అత్యవసర భేటీ?
పాక్ ప్రభుత్వం బహిరంగ ప్రకటనలు ఇస్తున్నా.. ఇప్పటివరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీకి (ICC) అధికారికంగా "మేం ఆడట్లేదు" అని లేఖ వెళ్లలేదట. ఈ అనిశ్చితిని తొలగించడానికి ఈరోజు (సోమవారం) ఐసీసీ అత్యవసరంగా సమావేశమయ్యే అవకాశముంది. పాక్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
పీఎస్ఎల్ (PSL) కు ఎసరు.. నిధులు కట్!
ఒకవేళ పాకిస్థాన్ వెనక్కి తగ్గకపోతే.. ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదం పొంచి ఉంది.
పీఎస్ఎల్ పై దెబ్బ: పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు వారి దేశాల బోర్డులు అనుమతులు (NOCs) నిరాకరించే ప్రమాదం ఉంది.
ఆర్థిక దిగ్బంధం: ఐసీసీ నుంచి ఏటా వచ్చే రెవెన్యూ వాటాను నిలిపివేసే అవకాశం ఉంది.
హోస్టింగ్ రద్దు: భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలను నిర్వహించే హక్కులను పాక్ కోల్పోవచ్చు.
భారత్: తగ్గేదే లే!
అవతలి వాళ్ళు వస్తారా రారా అనేది పక్కనబెడితే.. టీమిండియా మాత్రం షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అక్కడ ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొంటుంది. ప్రత్యర్థి రాకపోతే నిబంధనల ప్రకారం పాయింట్లు మన ఖాతాలో పడటం ఖాయం. బీసీసీఐ (BCCI) ఇప్పటివరకు దీనిపై అధికారికంగా స్పందించకపోయినా.. చేతల్లో మాత్రం క్లారిటీగా ఉంది.
ఆటగాళ్లు రెడీ.. రాజకీయమే అడ్డు!
సల్మాన్ వ్యాఖ్యలు చూస్తుంటే పాక్ ప్లేయర్లు మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. కానీ ప్రభుత్వ మొండితనం వల్ల క్రికెట్ బలైపోతోంది. ఈరోజు ఐసీసీ నిర్ణయంతో ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

