కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యశ్.. ఆ తర్వాత సినిమాతో రావడానికి చాలా ఏళ్లు తీసుకున్నారు. అసలు ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన రేంజ్‌ను యశ్ దాటగలడా? ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? అనే ప్రశ్నలతో ప్రేక్షకులు 'టాక్సిక్' (Toxic) కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. భారీ తారాగణం, హాలీవుడ్ స్థాయి మేకింగ్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం.. ఇలా అంచనాలు పెంచేయడానికి ఏమాత్రం లోటు లేకుండా వచ్చిన ఈ సినిమా బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మాఫియా డ్రామా.. ప్రేక్షకులకు అసలైన కిక్ ఇచ్చిందా? లేదా యాక్షన్ మాయలో పడి కథను పక్కనపెట్టేశారా? అన్నది ఇప్పుడు చూద్దాం.
[FEATURED_IMAGE]అక్క సెంటిమెంట్.. గోవా మాఫియా సామ్రాజ్యం
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన గంగా (నయనతార), రాయ (యశ్) అక్కాతమ్ముళ్లు. తమ్ముడి కోసం ఆ అక్కే అమ్మలా మారుతుంది. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ పెంచి పెద్ద చేస్తుంది. నేర ప్రపంచంలోనే పెరిగిన వీరు, అదే దారిలో ఎదుగుతారు. తన తమ్ముడు గోవా మాఫియా సామ్రాజ్యానికి డాన్ కావాలన్నది గంగ కల. అందుకోసం అప్పటికే గోవాను పాలిస్తున్న ఒక లోకల్ డాన్‌తో చేతులు కలుపుతుంది. ఆ గ్యాంగ్‌లో రాయ కీలకంగా మారుతాడు. ఆ క్రమంలో డాన్ కూతురు రెబెక్కా (తారా సుతారియా)తో రాయకు పరిచయం, ప్రేమ ఏర్పడతాయి.
కానీ ప్రత్యర్థులతో దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే కథ మలుపు తిరుగుతుంది. రాయకు, రాయల్ సర్కస్‌లో పనిచేసే నాడియా (కియారా అద్వానీ) పరిచయం అవుతుంది. అది కాస్తా శారీరక, మానసిక బంధంగా మారి నాడియా గర్భవతి అవుతుంది. తన కూతురిని కాదని వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడని తెలుసుకున్న డాన్ రాయపై రగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన ఒక కలామిటీలో రాయ చేతిలో ఆ డాన్ హతుడవుతాడు. మరోవైపు అనుకోని పరిస్థితుల్లో శత్రువుల చేతికి నాడియా, గంగ చిక్కుకుంటారు. నాడియా కడుపులోని బిడ్డను చంపుతామని బెదిరించి, దండగులు ఆమె చేతుల మీదుగానే అక్క గంగను చంపిస్తారు. తన అక్క చావుకు కారణమైన ప్రియురాలిని రాయ క్షమించాడా? శిక్షించాడా? నాడియా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అక్క కోరిక ప్రకారం గోవా మాఫియాను రాయ శాసించాడా? అన్నదే మిగతా కథ.
కేజీఎఫ్ ఛాయలు.. రక్తపాతమే హైలైట్
కథ పరంగా చూస్తే ఇది చాలా సాధారణమైన కథ. కేజీఎఫ్‌లో హీరో తల్లి సెంటిమెంట్‌తో డాన్‌గా ఎదిగితే, ఇందులో అక్క సెంటిమెంట్‌తో ఎదుగుతాడు. నిజానికి తప్పు చేసిన ఒక తండ్రి మానసిక వేదనే ఈ సినిమా కథ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా రెగ్యులర్ మాఫియా సినిమాలానే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో వచ్చే మలుపు, దానికి సంబంధించిన సంఘర్షణ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ అసలు కథ కంటే ఎక్కువగా కత్తులు, తుపాకులు, రక్తపాతానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆద్యంతం నరుక్కోవడాలు, కాల్పులు, ఇంటిమేట్ సీన్స్ ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు కలిసి చూసే సినిమా అయితే కాదు. కానీ విజువల్స్ పరంగా రిచ్‌గా, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కించారు.
ద్విపాత్రాభినయంలో యశ్.. యాక్షన్‌లో నయన్
ఈ చిత్రంలో యశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే తండ్రి రాయకు, కొడుకు టికెట్ పాత్రకు పెద్దగా సంబంధం ఉండదు. తండ్రి రాయగా యశ్ విశ్వరూపం చూపించాడు. కొడుకు పాత్ర కోసం బరువు తగ్గి ద్వితీయార్థంలో అద్భుతమైన ఎమోషన్స్, సంఘర్షణ పండించాడు. ఇక నయనతార అక్క గంగగా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయడమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టింది. కియారా అద్వానీ భావోద్వేగపూరితమైన నటనతో మెప్పించింది. తారా సుతారియా, రుక్మిణీ వసంత్ క్యారెక్టర్లు కేవలం గ్లామర్ కోసమే పరిమితం అయ్యాయి.
సాంకేతిక వర్గం కష్టం ఎలా ఉందంటే?
సినిమాలో చెప్పుకోదగ్గ కథ లేకపోయినా మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాత వెంకట్ కె నారాయణ డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు ప్రతి పైసా తెరపై రిచ్‌గా కనిపించింది. రవి బస్రూర్, విశాల్ మిశ్రా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ బాగున్నాయి. అయితే గీతూ మోహన్‌దాస్ రాసుకున్న స్క్రీన్‌ప్లేను అర్థం చేసుకోవడం సగటు ప్రేక్షకుడికి కష్టమే. కథ, కథనం, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.
బలాలు: యశ్ నటన, స్టైలిష్ మేకింగ్, హీరోయిన్ల గ్లామర్, యాక్షన్ సీన్స్.
బలహీనతలు: కథ, కథనం, ఎడిటింగ్.
రేటింగ్: 2.5/5
విశ్లేషణ
కేవలం భారీ బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్లు ఉంటే పాన్ ఇండియా హిట్లు వచ్చేస్తాయన్న భ్రమలోంచి మేకర్స్ బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. యాక్షన్ సీన్స్ పేరుతో అంతులేని హింసను చూపిస్తే థ్రిల్ రాదు, విసుగొస్తుంది. బలమైన ఎమోషన్, అర్థమయ్యే స్క్రీన్‌ప్లే లేకపోతే 'టాక్సిక్' లాంటి భారీ ప్రాజెక్టులు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వవు. కేజీఎఫ్ లాంటి మ్యాజిక్ ఆశించి థియేటర్‌కు వెళ్లే వాళ్లకు ఈ సినిమా కాస్త నిరాశనే మిగుల్చుతుంది.

