ఉదయం లేవగానే రాశి ఫలాలు చూడనిదే బయటకు వెళ్లని వారు మనలో చాలామందే ఉంటారు. కానీ అదే జాతకాల పిచ్చి శృతిమించితే జీవితం ఎంత హాస్యస్ఫదంగా మారుతుందో చెప్పే సినిమానే 'విష్ణు విన్యాసం'. వీకెండ్‌లో హాయిగా నవ్వుకుందామని థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకుడికి శ్రీవిష్ణు ఈసారి ఎలాంటి వినోదం పంచాడు? ఫస్ట్ హాఫ్ నవ్వించినా.. సెకండాఫ్ ఎందుకు తడబడింది? అసలు వందలు ఖర్చుపెట్టి ఈ సినిమాకు వెళ్లొచ్చా? రివ్యూలో చూద్దాం.
జాతకాల పిచ్చోడి ప్రేమకథ!
శ్రీవిష్ణు (విష్ణు) ఒంగోలులో ఓ కాలేజ్ లెక్చరర్. ఇంటి వాస్తు బాగాలేదని పక్కింటి బాత్‌రూమ్‌కు అద్దె కట్టేంత జాతకాల పిచ్చి అతడిది. ముద్దు పెట్టుకోవాలన్నా ముందుగా పంతులుకి ఫోన్ చేసి ముహూర్తం అడిగే రకం.
అలాంటి వాడి జీవితంలోకి అదే కాలేజీలో పనిచేసే మనీషా (నయన్ సారిక) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది, కానీ తీరా పెళ్లి సమయానికి వధువు జాతకంలో ఉన్న ఓ అతిపెద్ద గండం బయటపడుతుంది.
ఆ గండం నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు.. జాతకాల పిచ్చి ఉన్నోడికి జాతక దోషం ఉన్న అమ్మాయి తగిలితే ఆ విన్యాసాలు ఎలా ఉంటాయన్నదే ఈ సినిమా కథ.
ఫస్ట్ హాఫ్ ఫన్.. సెకండ్ హాఫ్ రన్!
కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు ఎంచుకున్న పాయింట్ పాతదే (రాజేంద్ర ప్రసాద్ 'ఆ ఒక్కటీ అడక్కు' తరహా) అయినా.. శ్రీవిష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఫస్ట్ హాఫ్ ను హిలేరియస్ గా లాగించేశారు.
కానీ, ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ తర్వాత.. సెకండ్ హాఫ్ కథనం పూర్తిగా పక్కదారి పట్టింది. సోషల్ మీడియా మీమ్స్, డబుల్ మీనింగ్ డైలాగులపై ఎక్కువగా ఆధారపడటం సామాన్య, ఫ్యామిలీ ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కేవలం మీమ్ పేజీలు ఫాలో అయ్యే యూత్ కు మాత్రమే ఆ డైలాగులు కనెక్ట్ అవుతాయి.
నయన్ సారిక గ్లామర్.. టెక్నికల్ వాల్యూస్
హీరోతో సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలో నయన్ సారిక (Nayan Sarika) మెప్పించింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, శ్రీవిష్ణుతో కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యాయి. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితర డజన్ల కొద్దీ తారాగణం ఉన్నా.. కథలో బలం లేకపోవడంతో తేలిపోయారు.
టెక్నికల్ గా చూస్తే.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. రధన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తాయి. కేవలం రెండు గంటల నిడివి కావడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
ఓటీటీకైతే ఓకే.. థియేటర్‌కైతే ఆలోచించాల్సిందే!
శ్రీవిష్ణు నటన, టైమింగ్ కు వంక పెట్టలేం కానీ.. దర్శకుడు కేవలం ఆయన ఇమేజ్ పైనే భారం వేసి వదిలేశాడు. మీమ్స్ ఫాలో అయ్యే యూత్ కు ఈ సినిమా నచ్చుతుంది కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఇది పూర్తిస్థాయి వినోదాన్ని ఇవ్వలేకపోయింది. "ఫస్టాఫ్ విష్ణు విన్యాసం.. సెకండాఫ్ విష్ణు విలాపం" అన్నట్లుగా సాగిన ఈ సినిమాను.. థియేటర్లలో వందలు ఖర్చుపెట్టి చూసేకంటే, కొన్ని రోజులు ఆగి ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఓటీటీలో (OTT) చూస్తే సామాన్యుడికి డబ్బు ఆదా అవుతుంది, సినిమా కూడా బాగా నచ్చుతుంది!

